గ‌త కొద్దికాలంగా ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుప‌డుతున్న జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌ఠాత్తుగా ఢిల్లీ టూర్ పెట్టుకోవ‌డం...ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలను క‌ల‌వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌డం...అయితే అలాంటి స‌మావేశాలు లేకుండానే ఆయ‌న తిరుగుప్ర‌యాణం కావ‌డం తెలిసిన సంగతే. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ బీజేపీ పెద్ల‌ల‌ను ఫిదా చేసే య‌త్నం చేస్తున్నార‌ని...తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. 

 

గ‌త కొద్దికాలంగా భాష‌, సంస్కృతిపై స్పందిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...తాజాగా దేశం సంస్కృతిపై త‌న అభిప్రాయాలు వినిపించారు. ప్రాంతీయంగా సంస్కృతి, భాషల ప్రాముఖ్యతను, విశిష్టతనీ అర్థం చేసుకొనే నాయకత్వాలు... ప్రజల్లో అంతరాలను తగ్గించే నాయకత్వాలు లేనప్పుడూ, కేవలం తమ రాజకీయ ఉనికి కోసం  పని చేసే నాయకులూ ఉంటే చాలా  వేర్పాటువాదాలకు బలమైన బీజాలు ఏర్పడతాయని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇదే విష‌యాన్ని తాను ప్ర‌ధానికి వివ‌రించిన‌ట్లు తెలిపారు. ``భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి నాయకత్వం కృషి చేయలేకపోవడం వల్ల అంతరాలు అలాగే ఉన్నాయి. కొంతమంది రాజకీయ లబ్ది కోసం ఈ అంతరాలను పెంచేశారు. పెంచేస్తూ ఉంటారు కూడా. నేను ఈ అభిప్రాయాలనే 2014 లో అప్పుడు ప్రధాన మంత్రి అభ్యర్థి, ప్రస్తుత ప్రధాని అయిన నరేంద్ర మోడీకి తెలియచేశాను. మీలాంటి బలమైన వ్యక్తులు ఉన్నంతకాలం ఫర్వాలేదు గానీ బలహీనమైన వ్యక్తులు పాలనలోకి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ అనే వేర్పాటువాదాలు వస్తాయి... వీటిపై దృష్టి సారించాలని చెప్పాను` అని ప్ర‌ధానిని బ‌ల‌మైన వ్య‌క్తిగా ప‌వ‌న్ విశ్లేషించారు.

 

ఈ సంద‌ర్భంగానే కీల‌క‌మైన క‌శ్మీర్ అంశంపై ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``కశ్మీర్‌ను దేశంలో అంతర్భాగం చేసిన తరుణంలో దేశ భాష సంస్కృతులను దెబ్బ తీసి, సమగ్రతకు భంగం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతిపరంగా విడదీయడానికి ఒక తాత్త్విక భూమికను తయారు చేస్తున్నారని జ‌రుగుతున్న ప్ర‌చారంపై ప్రధానమంత్రి, కేంద్ర హోమ్ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలి.  ఈ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా స్పందించాల్సి ఉంది.`` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: