అమరావతి రాజధాని పర్యటన చేపట్టిన చంద్రబాబుకు ఆదిలోనే నిరసనకారులు అడ్డు తగిలారు. బాబూ గో బ్యాక్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి పర్యటన ప్రారంభించిన  చంద్రబాబు పర్యటనకు పోలీసులు భద్రత కల్పించారు. మంతెన సత్యనారాయణ ఆశ్రమం దాటిన తర్వాత రైతులు ఆయనను అడ్డుకున్నారు. పర్యటనలో రైతుల పోటాపోటీ నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ వైపు దూసుకెళ్లేందుకు ఓ వర్గం రైతులు తీవ్ర ప్రయత్నం చేశారు. వీరికి నిరసనగా మరో వర్గం రైతులు కూడా ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రోప్ పార్టీ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 

బాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు బాబు కాన్వాయ్ పైకి, అనుసరిస్తున్న వాహనాలపైకి రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారు. రైతులు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. బాబు పర్యటించే వెంకటపాలెం ప్రాంతంలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రాకతో.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. బాబు పర్యటన ప్రాంతంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటపాలెంలో టీడీపీ నేతలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులతో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు.

 

ఈ సందర్బంగా జరిగిన తోపులాట..  టీడీపీ కార్యకర్తల దాడిలో ఇద్దరు రైతులకు గాయాలయ్యాయి. టీడీపీ నేతలు బయటి నుంచి జనాలను తీసుకొచ్చారని ఓ వర్గం నాయకులు ఆరోపించారు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా వాళ్లు తప్ప ఎవరూ కనిపించడం లేదన్నారు. అసైన్డ్ భూముల రైతులంటే చంద్రబాబుకు అంత అలుసయ్యారని, రైతు అనేవాడు ఉండకూడదనేది చంద్రబాబు ఆలోచనని మండిపడ్డారు. అన్యాయంపై నిరసన తెలుపుతుంటే మాపై దాడి చేస్తారా? విజయవాడ, గుంటూరు నుంచి గూండాలను తీసుకొచ్చి దాడి చేశారని కూడా ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: