రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం చటాన్ పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చటాన్ పల్లి గ్రామం సమీపంలోని అండర్ బ్రిడ్జి కింద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఒక యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసులు హత్యకు గురైన యువతి ప్రియాంక రెడ్డి అని ఈమె డాక్టర్ అని గుర్తించారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో పోలీసులు యువతి మృతదేహాన్ని గుర్తించారు. 
 
ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో ప్రియాంకరెడ్డి వెటర్నరీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న విధులు ముగించుకొని వెళ్లే సమయంలో ప్రియాంక రెడ్డి బైక్ టైర్ పంక్చర్ అయింది. కొంతమంది లారీ డ్రైవర్లు యువతిని అత్యాచారం చేసి హత్య చేశారని తెలుస్తోంది. యువతిని పెట్రోల్ పోసి దుండగులు దగ్ధం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. 
 
ప్రియాంక రెడ్డి మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకొని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎవరైనా ప్లాన్ చేసి ఈ పని చేశారా...? లేక లారీ డ్రైవర్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా...? అనే విషయం పోలీసుల దర్యాప్తు తరువాత తెలిసే అవకాశం ఉంది. పోలీసుల ప్రత్యేక బృందాల ద్వారా నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసులు పోస్టుమార్టం కొరకు షాద్ నగర్ కు ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని తరలించారు. ప్రియాంక సోదరి మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక బైక్ పంక్చర్ అయిందని తనతో చెప్పిందని కొంతమంది బైక్ ను బాగు చేసి ఇస్తామని చెప్పినట్లు తనతో చెప్పిందని, తనకు చాలా భయంగా ఉందని కూడా తనతో చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాకు చెప్పారు. ప్రియాంక సోదరి టోల్ బూత్ లో ఉండమని సలహా ఇచ్చినా ప్రియాంక ఆ సలహాను వినలేదని సమాచారం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: