``ప్ర‌పంచ ప‌టంలో అమ‌రావ‌తికి చోటు క‌ల్పించే వ‌ర‌కు నిద్ర పోను``- ఇదీ గ‌డిచిన ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర బాబు చివ‌రి మూడేళ్లు చేసిన మాట‌ల జ‌పం. మాట‌ల్లో ఉన్న వాడి, వేడిని ఆయ‌న‌చేత‌ల్లో చూపించ‌ని పాప‌మే ఇప్పుడు చంద్ర‌బాబు రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌లో రాళ్లు వేసే లా చేసింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అన్నిం టికీ ఏకైక ప‌రిష్కారంగా తాత్కాలిక నిర్మాణాల‌ను ఆయ‌న భుజాన ఎత్తుకున్న నాడు, రాజ‌ధానిపై శివ‌రామ కృష్ణ‌న్ క‌మిటీ నివేదిక‌ను కృష్ణ‌లో క‌లిపి.. మంత్రి నారాయ‌ణ క‌మిటీని నెత్తికున్న‌నాడు బాబుపై అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకున్నాయి.

 

ఎవ‌రికో కొంద‌రికి మేళ్లు చేయాల‌నే త‌లంపుతోనే అమ‌రావ‌తిని కృష్ణా క‌ర‌క‌ట్ట వెంబ‌డి ఎంచుకున్న విమ‌ర్శ‌ల‌కు బాబు అండ్ కో నుంచి నేటికీ స‌మాధానం లేదు.  ఎదురు దాడి త‌ప్ప‌..! గ‌డిచిన మూడు బ‌డ్జెట్‌ల‌లో 2017, 2018, 2019(ఓటాన్ అకౌంట్‌) భారీ ఎత్తున 59 వేల కోట్ల‌ను రాజ‌ధాని నిర్మాణాల‌కు కేటాయించిన ఘ‌న చ‌రిత్ర ఉన్నా.. ఖర్చు చేసింది, వాస్త‌వంగా కేటాయించింది. దీనిలో పావుభాగం కూడా లేక పోవ‌డం అమ‌రావ‌తిపై బాబు చిత్త శుద్ధిని తెర‌మీద‌కి తెచ్చింది. తాత్కాలికం ఎవ‌రు క‌ట్ట‌మ‌న్నారు ? అన్న ప్ర‌తిప‌క్ష వైసీపీ మాట‌ల‌కు స‌మాధానం లేని ఎదురు దాడితోనే స‌రిపెట్టిన చంద్ర‌బాబు.. నేడు తాను క‌ట్టుకున్న క‌ల‌ల కోట కూలిపోతోంద‌ని వ‌గ‌రుస్తున్నా.. ఎవ‌రి సింప‌తీనీ ఆయ‌న ప్రోది చేసుకోలేక పోవ‌డం అశ‌నిపాత‌మే అవుతుంది.

 

అయిన కాడికి భూముల‌ను అయిన వారికి పందేలు చేసిన చంద్ర‌దండు.. నేడు ప‌ర్య‌టించి జ‌గ‌న్‌ను విఫ‌ల‌మైన నాయ‌కుడిగా ప్ర‌జ‌ల‌ముందు ప్రొజెక్ట్ చేయాల‌ని అనుకున్నారు.అయితే, ఆదిలోనే హంస‌పాదులా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను రాజ‌ధానిలో రైతు గ‌ణం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న మాట వాస్త‌వం. వారికి నాలుగేళ్ల‌లోనే భూముల‌ను డెవ‌ల‌ప్ చేసి ఇస్తామ‌ని, కార్పొరేట్ త‌ర‌హాలో వారికి అవ కాశం ఇస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు గ‌డిచిన నాలుగేళ్ల‌లో చేసింది శూన్యం. అదే స‌మ‌యంలో కేంద్రం నుంచి అమ‌రావ‌తికి ఏదో తెప్పిస్తాన‌ని చెప్పిన బాబు వ్యూహం కూడా విఫ‌ల‌మైంది.

 

ఈ మొత్తం ప‌ర్య‌వ‌సా నం ఇప్పుడు ఆయ‌న బూమ‌రాంగ్ మాదిరిగా మారిపోయింది. తాత్కాలిక స‌చివాల‌యం, తాత్కాలిక హైకోర్టు.. అలా అన్నీతాత్కాలిక‌మే..! దీనివ‌ల్ల ప్ర‌జాధ‌నం వృధా అయింద‌నే వాద‌న‌కు బ‌ల‌మైన ఎదురు దాడి చేయ‌డంలోనూ లేదా స‌మాధానం చెప్పి త‌ప్పించుకోవ‌డంలోనూ బాబు విఫ‌ల‌మ‌య్యారు. ఈ ప‌రిస్థితిలో ఇప్ప‌టికిప్పుడు అమ‌రావ‌తిని ఎంచుకోవ‌డం ఆయ‌న సంక‌ల్ప శుద్దిలో లోపాన్ని త‌ప్ప‌కుండా ఎత్తిచూపుతుంద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: