సాధారణంగా ఎక్కడైనా దొంగతనం జరిగితే డబ్బు, బంగారం, ఇతర వస్తువులు చోరీ కావడం గురించి వినే ఉంటాం. కానీ పశ్చిమ బెంగాల్ లో దొంగలు రూట్ మార్చారు. దొంగతనానికొచ్చిన దొంగలు దుకాణంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉల్లిపాయలను దొంగతనం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో అక్షయ్ దాస్ అనే వ్యాపారి కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. 
 
రోజూలానే దుకాణం తెరచిన అక్షయ్ దాస్ దుకాణంలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో షాక్ అయ్యాడు. దొంగతనం జరిగిందని గ్రహించిన అక్షయ్ దాస్ క్యాష్ బాక్స్ చెక్ చేయగా క్యాష్ బాక్స్ లో నగదు అలానే ఉంది. కానీ ఉల్లిగడ్డల బస్తాలు మాత్రం కనిపించలేదు. ఉల్లిగడ్డల బస్తాలు పోవటంతో అక్షయ్ దాస్ కు అసలు విషయం అర్థమైంది. వెంటనే అక్షయ్ దాస్ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఉల్లిగడ్డల బస్తాల దొంగతనం గురించి ఫిర్యాదు చేశాడు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. గత మూడు నెలలుగా దేశమంతటా ఉల్లి రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి 90 రూపాయల నుండి 110 రూపాయలు పలుకుతోంది. తమిళనాడు రాష్ట్రంలో కిలో ఉల్లి 130 రూపాయల నుండి 150 రూపాయలు పలుకుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఉల్లి రేట్లు భారీగా పెరిగాయి. 
 
మరో మూడు వారాల పాటు ప్రజలకు ఉల్లి కష్టాలు తప్పవని వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో పెట్రోల్ ధర కంటే కిలో ఉల్లిపాయల ధరే ఎక్కువగా ఉండటంతో ఈ దొంగతనం జరిగిందని తెలుస్తోంది. అక్షయ్ దాస్ దాదాపు 50 వేల రూపాయల విలువ గల ఉల్లిపాయలు మాయమయినట్లు చెబుతున్నాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగలు దేశంలో ఉల్లిగడ్డలు బంగారం కావడంతో ఉల్లిని దొంగతనం చేస్తున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: