తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌పై టీడీపీ నేత‌లు చేస్తున్న కామెంట్లకు పార్టీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సారధి కౌంట‌ర్ ఇచ్చారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. ``చంద్ర‌బాబు మేం నీలాగా అలాంటి కార్యక్రమాలు చేయం. అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌లో చంద్రబాబు సాగిలబడి నమస్కారం చేయాల్సింది శంఖుస్దాపన స్దలానికి కాదు. భూములు ఇచ్చిన రైతులకు, వారిని మోసం చేసినందుకు క్షమాపణలు చెబుతూ రైతులకు సాగిలబడాలి. మాయమాటలతో రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేశారు. రాజధాని పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి భూదోపిడీ చేశారు. రైతులు ఇచ్చిన భూములతో తన వారికి దోచిపెట్టారు. ఇవన్నీ కూడా చంద్రబాబు చేసిన పాపాలే.`` అని మండిప‌డ్డారు.

 

లక్ష కోట్లను పెట్టి రాజధాని నిర్మిస్తానని చెప్పిన చంద్ర‌బాబు అక్కడ కేవ‌లం సెట్టింగ్‌లు, బాహుబలి గ్రాఫిక్స్‌ చూపడం తప్పితే ఏం చేశార‌ని పార్థ‌సార‌థి ప్ర‌శ్నించారు. ``ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావు. అక్కడవి అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శంఖుస్థాపనకు వస్తే అక్కడి స్థానిక దళిత ఎమ్మెల్యేను కూర్చోబెట్టకుండా కార్యక్రమం నిర్వహించారు. అసైన్డ్‌ భూముల విషయంలో దళితులను నిలువునా మోసం చేశారు. వారి దగ్గర భూములు చౌకగా అమ్మించి మీవాళ్లు కొన్నతర్వాత వాటిని పూలింగ్‌కు తీసుకున్నావు చంద్ర‌బాబు. నీకు ఎన్నికల హామీలంటే నీటి బుడగలాంటివి, మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం లాంటిది కానీ జగన్‌మోహన్‌ రెడ్డి మనస్తత్వం అలాంటిది కాదు. మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తారు. అందుకే ఎన్నికల హామీలన్నింటిని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల హామీలను తుంగలో తొక్కి పేదవారికోసం చూడకుండా రాజధానికోసం ఖర్చు చేయాలా? మేం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్రను అన్నింటిని ప్రాధాన్యత ఇస్తూ ప్రజారాజధానిని నిర్మిస్తాం. ఇప్ప‌టికే నిర్మాణాలన్నింటిని పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.`` `` అని తెలిపారు.

 

చంద్రబాబునాయుడు పర్యటన చూసి తాము భయపడుతున్నట్లుగా లోకేష్‌ మాట్లాడుతుండ‌టం చిత్రంగా ఉంద‌ని పార్థసార‌థి అన్నారు. ``చంద్రబాబు డ్రామాలు ఆడటంలో దిట్ట. ఎన్టీఆర్‌కు సినిమాలలో నటించడం వల్ల పద్మవిభూషణ్‌ వంటి బిరుదులు వచ్చాయేమో కాని చంద్రబాబు అంత‌కంటే బ్రహ్మాండమైన నటుడు. మొన్న ఇసుక గురించి అన్ని నిర్ణయాలు తీసుకున్నతర్వాత ఇసుక దీక్ష చేస్తాడు. నేడు రాజధాని గురించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు రాజధానిలో పర్యటన చేస్తారు. రాజధాని ప్రజారాజధానిగా ఉండాలి, పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు, విదేశీ సంస్దలకు అడ్డగా మారకూడదు. ప్రజలందరితో సంబంధించిన ప్రజా రాజధానిగా ఉండాలి. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశాడు. చంద్రబాబులా మేం కుట్రలు,దౌర్జన్యపూరిత రాజకీయాలు చేయం. రాజధాని రైతులకు కౌలు చెల్లించిన ఘనత జగన్‌ గారికే దక్కుతుంది.`` అని ఆయ‌న పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: