ఎన్నిక‌లు ముగిసి, అధికారం కోల్పోయిన ఆరు మాసాల త‌ర్వాత ఏపీ మాజీ సీఎం, ప్ర‌పంచ మేధావి చంద్ర బాబు ఎంచుకున్న కీల‌క అంశం.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో రెండు రోజుల  ప‌ర్య‌ట‌న‌. దీనికి ఆయ‌న రాత్రికి రాత్రి వేసుకున్న స్కెచ్.. సీఎం జ‌గ‌న్‌ను విఫ‌ల నాయ‌కుడిగా ప్రొజెక్ట్ చేయ‌డ‌మే! దీనికి గాను రాత్రికి రాత్రి అన్నీ స‌మ‌కూర్చుకున్నారు. త‌మ్ముళ్ల‌ను హుటా హుటిన రాజ‌ధానికి పిలిపించారు. మందీ మార్బ‌లాన్ని ఏ ర్పాటు చేసుకున్నారు. అనుకూల మీడియాలో అనుకూల వార్త‌లు రాయించేశారు. కాగ‌ల కార్యం.. అన‌కూల మీడియా చేస్తుంద‌నే ధీమాతో రంగంలోకి దిగిపోయారు.

 

అయితే, రాజ‌ధాని పర్య‌ట‌న ద్వారా చంద్ర‌బాబు ఇప్ప‌టికిప్పుడు ఆశిస్తున్న‌ది ఏంటి?  అస‌లు ఇక్క‌డ బాబు ఇంత హ‌డావుడిగా ప‌ర్య‌టించ‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇక్క‌డేమైనా రైతుల‌కు ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అన్యాయం చేసిందా?(చేయాల్సింది ఏమీ లేద‌నేది వైసీపీ వాద‌న‌). వారికి ఇస్తున్న పింఛ‌న్ల‌ను ఆపేసిందా?  లేక ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు నిర్మించిన తాత్కాలిక భ‌వ‌న స‌ముదాయాల‌ను కూల్చేసిందా?  ఏమీలేదు. అయినా కూడా బాబు ఇక్క‌డ ఎందుకు ప‌ర్య‌టిస్తున్నారు?  దీనికి ఏకైక కార‌ణం.. జ‌గ‌న్‌ను దోషిగా నిల‌బెట్టాల నే క‌ల‌క ఉద్దేశం. పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టి.. ఐదు మాసాలు పూర్త‌యినా కూడా ఇక్క‌డ ఒక్క ఇటుక కూడా పేర్చ లేద‌ని చెప్ప‌డం.. జ‌గ‌న్‌కు పాల‌నా ద‌క్ష‌త లేద‌ని చాటింపు వేయ‌డ‌మే ఇప్పుడు బాబుముందున్న కీల‌క క‌ర్త‌వ్యాలు.

 

వీటికితోడు.. ప్ర‌పంచ బ్యాంకు స‌మా వివిధ పెట్టుబ‌డి సంస్థ‌లు వెన‌క్కి మ‌ళ్లిన విష‌యాల‌ను మ‌రింత పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌డం. అయితే, బాబు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాలు ఫ‌లించే మాట ఎలా ఉన్నా.. బెడిసి కొట్ట‌డం మాత్రం ఖాయం. సింగ‌పూర్ సంస్థ‌.. రాజ‌ధాని నుంచి స్వ‌చ్ఛందంగానే విర‌మించుకున్న‌ట్టు స్వ‌యంగా సింగ‌పూర్ మంత్రి శంక‌ర‌న్ వెల్ల‌డించారు. అంటే.. ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌మేయం లేదు. ఇక‌, ప్ర‌పంచ బ్యాంకు స్థానిక ప‌రిస్థితిని స్వ‌యంగా ప‌రిశీలించి రైతుల‌తో మాట్లాడి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మీక‌ర‌ణ భూముల విష‌యాన్ని తెలుసుకుని వెన‌క్కి త‌గ్గింది. దీనికి జ‌గ‌న్‌ను ఎవ‌రూ బాధ్యులు చేయ‌లేదు.

 

అదేస‌మ‌యంలో మ‌రో కీల‌క విష‌యం.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని మార్చేస్తుంద‌నే ప్ర‌చారం. కానీ, జ‌గ‌న్ కానీ, ఆయ‌న మంత్రులు కానీ, ఇత‌మిత్థంగా రాజ‌ధానిపై ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లే దు. మారుస్తామ‌ని కానీ, మార్చేస్తున్నామ‌ని కానీ చెప్ప‌లేదు. కేవ‌లం దీనిపై విష‌యాల‌ను సంగ్ర‌హిస్తున్నా మ‌ని, స‌మీక్షిస్తున్నామ‌ని మాత్ర‌మే చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు అంచ‌నా ప్ర‌కార‌మే 2050 నాటికి కానీ అమ‌రావ‌తి ఏర్పాటు పూర్తికాదు. అంటే.. అప్ప‌టి కికానీ పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం లేదు. మ‌రి ఇంత‌లోనే అంత యాగీ ఎందుకు?  అంటే కేవ‌లం రాజ‌కీయంగా దీనిని వినియోగించుకుని జ‌గ‌న్‌పై దుమ్మెత్తి పోయ‌డ‌మే కీల‌క ఎత్తుగ‌డ‌. మ‌రి ఈ విష‌యంలో బాబు ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: