ఇప్పటికే మహారాష్ట్రలో తప్పటడుగు వేసి ఘోర అవమానానికి గురైన భారతీయ జనతా పార్టీ కి ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లు బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇదే రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో విజయభేరి మోగించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పోటీ చేసిన మూడు స్థానాల్లో విజయం మమతాబెనర్జీ కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ను వరించింది. 

 

2012 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ముందుకెళ్తున్న కమలం పార్టీకి బెంగాల్ ఓటర్లు షాకిచ్చారు. కలియాగంజ్, ఖరగ్‌పూర్-సదర్, కరీంపూర్ అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ బలంగా ఉన్న కలియాగంజ్, ఖరగ్‌పూర్-సదర్ ప్రాంతాల్లోనూ టీఎంసీ విజయం సాధించడం కమలం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పొచ్చు.

 

ఇకపోతే నరేంద్ర మోడీ పైన మరియు అమిత్ షా పైన వీలు చిక్కినప్పుడల్లా విపరీతంగా విరుచుకుపడే కేటగిరీలో మమతా బెనర్జీ అందరికన్నా ముందు ఉంటారు. ఇప్పుడు ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాలతో ఈ ఐరన్ లేడీ మరింతగా విజృంభించి పూర్తిగా భాజపాను బెంగాల్లో భస్మం చేసే విధంగా పావులు కదుపుతోంది. లోక్ సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచి భాజపా తన రాకను ఘనంగా చాటుకున్నా... ఉప ఎన్నికల్లో టీఎంసీ మాత్రం ఇప్పటి వరకు తమకు విజయమే లేని కలియాగంజ్ నియోజకవర్గంలో విజయం సాధించి బెంగాల్ లో తామేంటో మళ్లీ నిరూపించుకుంది. 

 

ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న మమతా బెనర్జీ.. ఈ విజయాన్ని బెంగాల్ ప్రజలకు అంకితమిచ్చారు. బీజేపీ విభజన రాజకీయాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలు తాము బలపడటానికి ప్రయత్నించకుండా.. బీజేపీకి సహకరిస్తున్నాయని మమత ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: