ఓ దూకాణంలో దొంగ‌త‌నానికొచ్చి ఒక్క రూపాయి కూడా దొంగ‌లు దోచుకోకుండా వెళ్లారు. కానీ య‌జ‌మానీ మాత్రం ల‌బోదిబోమంటున్నాడు. అదేంటి డ‌బ్బులు పోన‌ప్పుడు ఎందుకు బాధ‌ప‌డ‌డం అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే ఇది చ‌ద‌వండి. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ దొంగతనం అక్కడ నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. అక్షయ్ దాస్ అనే వ్యక్తి..తూర్పు మిడ్నాపూర్ జిల్లా సుతహతా ప్రాంతంలో ఓ కూరగాయల షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం షాపు తెరవగానే అక్కడ ఉన్న పరిస్థితి చూసి షాక్ అయ్యారు.

 

సద‌రు వ్య‌క్తి షాపు తెర‌వ‌గానే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో షాపులో దొంగలు పడ్డారని అతడు నిర్ధరించుకున్నాడు. వెంటనే క్యాష్ బాక్స్ వద్దకు వెళ్లి.. కంగారుగా దాన్ని తెరిచి చూశాడు. అయితే గల్లా పెట్టిలో ఒక్క పైసా కూడా పోలేదు. మరి ఏం దొంగతనం చేశారా అని షాపు మొత్తాన్ని పరిశీలించగా దొంగలు ఏమి దోచుకెళ్లారో అప్పుడు తెలిసింది. షాపులో దాదాపు రూ. 50 వేల విలువైన ఉల్లిపాయలు మాయమ్యాయి. దీంతో అసలు విషయం అతడికి అర్ధమయ్యి ల‌బోదిబోమ‌న్నాడు. ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.

 

దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కూడా కేజీ ఉల్లి ధర రూ.100 వరకు పలుకుతోంది. దీంతో ఉల్లిని బంగారం కంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి. అదే విధంగా బెంగాల్‌లో కూడా ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  కిలో ఉల్లిపాయల ధర 100 రూపాయలకు చేరుకోవడంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు.  కొనకుండానే వాటి ధరలను విని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 

మరి దొంగలు కూడా డబ్బుల కంటే ఉల్లిపాయలే బెటరనుకుని వాటిని ఎత్తికెళ్లిపోయారు. షాపు యజమాని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు. మొత్తానికి ఉల్లిపాయల ధరలు పెరిగిపోవడంతో ఏకంగా వాటిని చోరీ చేసేందుకు కొన్ని గ్యాంగులు తిరుగుతున్నట్లు సమాచారం. దుకాణాదారులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: