ఆంధ్రప్రదేశ్ కు త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. దీనివల్ల ఏపీ ప్రజలకు చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.. ఇందుకుగాను ప్రపంచబ్యాంక్ త్వరలో భారీ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ను అమలు చేయడానికి సన్నద్ధం అవుతుంది. మన దేశంలో ఇప్పటి వరకు కర్ణాటక, ఒడిషాలలో మాత్రమే వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా వున్న ప్రపంచబ్యాంక్ తాజాగా ఏపీతో కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుంది.

 

 

ఈ వాటర్ షెడ్ కార్యక్రమాలను ప్రపంచబ్యాంక్ నిధులతో అమలు చేసే మూడో రాష్ట్రంగా దేశంలోనే ఏపీని ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయంలో ఏడుగురు ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో కూడిన బృందం రాష్ట్ర పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యింది. ఇందులో భాగంగా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో దాదాపు 70 మిలియన్ డాలర్ల మేరకు రుణంగా అందించేందుకు ప్రపంచబ్యాంక్ సంసిద్దత వ్యక్తం చేసింది.

 

 

ఇకపోతే వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో 70శాతం ప్రపంచబ్యాంక్, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక  రాయలసీమ జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదవుతున్నదని గుర్తించగా దీనితో పాటుగా ప్రకాశం జిల్లాను మొదటిదశ వాటర్ షెడ్ అమలుకు ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర గ్రామీణాభివృద్ది, వ్యవసాయ శాఖలు, వీటితో పాటుగా ఎపి స్పేస్ అప్లికబుల్ సెంటర్, వ్యవసాయ యూనివర్సిటీల కన్సార్టియం ద్వారా పర్యవేక్షణ చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

 

ఇందులో భాగంగా రాష్ట్రంలో నీటి యాజమాన్యంతో పాటు ఎపిశాట్ ద్వారా భూసార పరీక్షలు, ఎరువులు, పోషకాల విషయంలో రైతులకు మెరుగైన సూచనలను అందించడం, వ్యవసాయంలో అవసరం లేని ఎరువులు పోషకాల వినియోగానికి ఇక స్వస్తి చెప్పేలా వారిలో చైతన్యం కలిగించడం వంటి కార్యక్రమాలను   నిర్వహిస్తామని తెలిపారు. భూసార నివేదికలను నేల స్వభావాన్ని బట్టి ఏరకమైన పంటలు సాగు చేయవచ్చు తదితర అంశాలను కూడా వ్యవసాయశాఖ, మరియు వ్యవసాయ యూనివర్శిటీల భాగస్వామ్యంతో ఖరారు చేస్తామని ప్రపంచ బ్యాంక్ బృందం ఈ సందర్బంగా వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: