``టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన త‌ర్వాత‌ ప్రజల పొట్టలు నింపాం...కాని ఎవరి పొట్టలు కొట్టలేదు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి కండిషన్లు పెట్టడం లేద‌. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకుంటాం. ఎవరిపైనా వ్యక్తిగతంగా తమకు కోపం లేదు`అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. తక్షణమే ఆర్టీసీ కోసం రూ.100కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ``ఆర్టీసీ సంస్థ బతకాలి. ఆర్టీసీ కార్మికులంతా మా బిడ్డలే. కార్మికులను యాజమాన్యం వేధించకుండా చూస్తాం. వారిని కాదని మేం ఏ నిర్ణయం తీసుకోం.`` అని వారిని ఖుష్ చేశారు. ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపిన కేసీఆర్ ఈ మేర‌కు కార్మికుల‌కు వరాలు ఇచ్చారు. అయితే...ఆర్టీసీ స‌మ్మెతో..కేసీఆర్ చెల‌గాటం...కార్మికుల ప్రాణ‌సంక‌టం...సామాన్యుడికి షాకులు ప‌రంప‌ర అన్న‌ట్లుగా సాగిందంటున్నారు.

 


ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం అనే డిమాండ్‌తో కార్మికులు స‌మ్మెకు వెళ్లారు. దాదాపు 55 రోజుల స‌మ్మెలో ర‌వాణ స‌దుపాయాల కోసం ప్ర‌జ‌లు న‌ర‌కం అనుభ‌వించారు. సమ్మె కాలంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల సంగ‌తి లెక్కే లేదు. తాత్కాలిక డ్రైవ‌ర్ల నిర్వాకంతో ఈ స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. అయితే, ఎట్ట‌కేల‌కు స‌మ్మెకు ముగింపు ప‌డింది. కానీ..ఇక్క‌డ మ‌రో రూపంలో సామాన్యుడే మ‌ళ్లీ ఇక్క‌ట్ల పాలు కానున్నాడు. ఆర్టీసీకి లాభాల పంట పండించేలా వచ్చే సోమవారం నుంచి కిలోమీటర్ కు 20పైసలు పెంచుతున్నట్లు విలేక‌రుల స‌మావేశంలో కేసీఆర్‌ తెలిపారు. తద్వారా  750కోట్లు అదనపు ఆదాయం వస్తుందన్నారు. కిలోమీట‌ర్‌కు 20 పైస‌ల చొప్పున అంటే 100 కిలోమీట‌ర్ల ప్ర‌యాణంలో భాగంగా రూ.20 ఛార్జ్ పెరగ‌నుంద‌న్నమాట‌. ఈమేర‌కు కేసీఆర్ సామాన్యుడి న‌డ్డి విర‌వ‌నున్నారు.

 

ఇదిలాఉండ‌గా, ఇప్పటికైనా కార్మికులు నిజం తెలుసుకోవాల‌ని కేసీఆర్ కోరారు. యూనియన్లు, ప్రతిపక్షాల మాటలు విని మీ బతుకులు ఆగం చేసుకోవద్దని కార్మికులను సీఎం కేసీఆర్‌ కోరారు. చెప్పుడు మాటలు విని ఆర్టసీని నాశనం చేసుకున్నారు. అయినా సరే నేను చెప్పినట్లు చేస్తే ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చుకుందామని తాను ఆర్టీసీ మంత్రిగా పనిచేసిన రోజులను సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: