చంద్రబాబు గత ఐదేళ్లలో అమరావతి అంటూ .. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ ఐదేళ్లు ప్రపంచం మొత్తం తిరిగాడు. కానీ వాస్తవ రూపంలో మాత్రం అమరావతి రూపుదాల్చలేదు. దాని పర్యవసానమే టీడీపీ ఘోర ఓటమి. అయితే రాజధాని కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే రాజధాని ప్రాంతంలో రాళ్ల దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రైతుల నుంచి 33 వేల ఎకరాలను సమీకరణ పద్ధతిలో తీసుకున్న రికార్డు చెరిగిపోకపోయినా.. ఆ తర్వాత రైతులకు సరైన విధంగా సమయానుకూల న్యాయం జరగలేదన్నది నిర్వివాదాంశం.

 

అమరావతిలో కనీసం పునాదులు కూడా లేకపోవటంతో బాబును ప్రజలు నిర్ధాక్షిణంగా ఓడించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీని తీసుకువచ్చి శంకుస్థాపన అయితే చేయించగలిగారు కానీ అమరావతికి ఇటుకలు పేర్చడంలో ఆయన సాయాన్ని అందిపుచ్చుకోలేక పోయారు. ఫలితంగా మూడు అడుగులు ముందుకు పది అడుగులు వెనక్కి చందంగా అమరావతి రాజధాని మారిపోయింది. అదే సమయంలో విపక్షంగా ఉన్న అప్పటి వైసీపీ కూడా సహజంగా లేవనెత్తే వివాదాంశాలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేక పోవడం కూడా పరిస్థితిని దారుణానికి చేర్చింది.



ఇప్పుడు చంద్రబాబు మీద ప్రజలకు ఎటువంటి జాలి లేదు. పైగా ఇంకా కోపం జనాల్లో తగ్గలేదని చెప్పాలి. అప్పు ఇస్తానన్న ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే తప్పుకొందన్న విషయాన్ని టీడీపీ నేతలు దాచాలని ప్రయత్నించినా దాగలేదు. కొందరు రైతులు ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇక్కడ పురిగొల్పిన ఉత్సాహం వెనుక పూర్తిగా రాజకీయ కారణాలే ఉన్నాయనేది వాస్తవం. దీనిని కాదని ఖండించలేని పరిస్థితి చంద్రబాబుకు వెంటాడింది. దీంతో అమరావతిపై నీలి నీడలు నేడు కాదు.. నాడే(బాబు హయాంలో) ముసురుకున్నాయి. నేడు అవి మరింతగా ఊడలు దిగాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు అక్కడ పర్యటించి ఏం చెప్పాలని అనుకుంటున్నా.. ఎవరూ వినేందుకు సిద్దంగా లేరనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: