బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి...తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగి రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్‌)పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొద‌లుపెట్టి....ఐదేళ్ల పాటు నడిపిన త‌ర్వాత ఆ వేదిక‌ను న‌డిపి అనంత‌రం  త‌న పోరాటానికి మంగ‌ళం పాడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆర్‌పీఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన త‌ర్వాత బైరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అనంత‌రం ఆయ‌న‌ చూపు ఏపీలో అధికారంలో తెలుగుదేశం పార్టీపై ప‌డింది. అయితే, ఆ పార్టీ మ‌ట్టిక‌రుచుకుకుపోవ‌డంతో...మ‌ళ్లీ కండువా మార్చుకున్నారు. బీజేపీలో చేరారు. 

 

దివంగ‌త ఎన్‌టిఆర్‌ పిలుపుతో 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బైరెడ్డి పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసిన సమయంలో రాయలసీమ పూర్తిగా అన్యాయానికి గురవుతుందనే ఆందోళనతో 2013లో ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమాన్ని చేపట్టారు. అయితే ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ కోల్పోయింద‌నే భావ‌న‌తో బైరెడ్డి త‌న చాప చుట్టేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో త‌న‌ను బ‌రిలో నిలిపిన అభ్య‌ర్థిని కేవ‌లం 154 ఓట్లు సాధించడంతో త‌న పోరాటం ఆపేస్తున్న‌ట్లు బైరెడ్డి ప్ర‌క‌టించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ శివారులోని కృష్ణానది ఒడ్డున బైరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించేందుకు కార్యకర్తలతో సమావేశమయిన సమయంలో ఈ ప్ర‌క‌ట‌న చేశారు. రాయలసీమ ఉద్యమాన్ని ప్రజలు ఆదరించనందువల్లే, ప్రత్యామ్నాయం కోసం రాయలసీమ ఉద్యమ కాడిని కింది దించేశానన్నారు.  

 

సొంత పార్టీ చాప చుట్టేసిన అనంత‌రం బైరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అనంత‌రం కాంగ్రెస్ కు కూడా రాజీనామా చేశారు. మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఆ పార్టీ పరిస్థితి బాగాలేకపోవడంతో బైరెడ్డి బీజేపీ వైపు చూశారు. ఈ నెల 24వ తేదీన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై బీజేపీలో చేరే విషయం ప్ర‌క‌టించి ఓకే చేసుకున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో...త‌న కూతురుతో క‌లిసి పార్టీ కండువా క‌ప్పుకొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: