ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  పలు షరతులు విధిస్తారని విపక్షాలు భావించాయి . అదే అదనుగా  ప్రజల్లోకి వెళ్లి తాము కేసీఆర్ వైఖరిని ఎండగట్టవచ్చునని యోచించాయి . ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే సహించేది లేదంటూ ఇప్పటికే విపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విషయం తెల్సిందే .  ఆర్టీసీ లో 20 శాతం ప్రైవేట్  బస్సులను తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు . ఈ మేరకు ఆర్టీసీ లో బస్సులను పెట్టేందుకు ప్రైవేట్  ఆపరేటర్లు రెడీ ఉన్నట్లు ప్రకటించారు . ఇక రూట్ల ప్రైవేటీకరణ కేబినెట్ లో తీర్మానం చేసి ఆమోదించినప్పటికీ , ప్రస్తుతం ప్రైవేట్  బస్సులు , రూట్ల ప్రైవేటీకరణ గురించి కేబినెట్ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం లో  కేసీఆర్ వ్యూహాత్మకంగానే ప్రస్తావించలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి .

 

ఆర్టీసిలోకి ప్రైవేట్ బస్సులను  తీసుకునే అంశం , రూట్ల ప్రయివేటీకరణ గురించి ప్రస్తావిస్తే విపక్షాల చేతికి ఆయుధాన్ని అందించిన వాన్ని అవుతానని తెలిసే వ్యూహాత్మకంగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దాటవేశారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . అయితే తాము రూట్ల ప్రయివేటీకరణ , బస్సుల ప్రయివేటీకరణ ద్వారా కూడా స్వచ్చంద విరమణ చేసిన ఆర్టీసీ కార్మికులకు ఉపాధి కల్పించాలని యోచించినట్లు చెప్పుకొచ్చి , ఇన్నాళ్ళుగా తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కేసీఆర్ పరోక్షంగా తిప్పికొట్టారు.  గత మూడు రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి , విధుల్లో చేరేందుకు డిపోల ముందుకు వస్తే వారిని పోలీసుల చేత గెంటివేయించడమే కాకుండా , పలువుర్ని అరెస్టు  చేసిన  విషయం తెల్సిందే .

 

 ఇక మహిళా కండక్టర్లు కన్నీటి పర్యంతమైన తీరు ప్రతి ఒక్కర్ని కలిచివేసింది . ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకింత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా విన్పించాయి . ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణ అనంతరం ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశ్యం తో గురువారం కేబినెట్ భేటీ నిర్వహించిన కేసీఆర్ , కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించి నిన్న , మొన్నటి వరకూ తనని విమర్శించిన నోళ్లను మూయించడమే కాకుండా , ప్రతిపక్షాలకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు .  కేసీఆర్ నిర్ణయంతో ప్రస్తుతం ఆర్టీసీ గురించి విపక్షాలు నోరెత్తలేని పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: