బీజేపీతో చెలిమి చేయాలన్న తహతహ నానాటికీ చంద్రబాబులో పెరిగిపోతోంది. ఆయన ఈ మధ్యనే నరేంద్ర మోడీ అమిత్ షాలను పొగుడుతూ మరింతగా డైరెక్ట్ అయిపోయారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఇండియా మ్యాప్ సవరించడం ద్వారా మోడీ షాలు మంచి  మేలు చేశారని బాబు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ఇక మోడీ మన్ కి బాత్ కార్యక్రమలో మాత్రు భాష ఆవశ్యకత గురించి చెప్పారని చెబుతూ చంద్రబాబు ఆయన్ని మరో మారు పొగిడారు. జగన్ ఈ విషయంలో మోడీని కూడా తిడతారంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీలో మళ్ళీ స్నేహం కోసం బాబు పెద్ద స్కెచ్ వేశారని అంటున్నారు.

 

బీజేపీలో ఇపుడు చంద్రబాబుకు జూనియర్ నేతల సాయమే ఇందుకు అక్కరకు వస్తోందిట. బాబు సమకాలీకులైన వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ వంటి వారు రాజ్యాంగ పదవుల్లో కుదురుకున్నారు. ఇపుడు తెలంగాణా నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న జి  కిషన్ రెడ్డి ని బాబు దువ్వుతున్నారని అంటున్నారు. కిషన్ రెడ్డి వెంకయ్యనాయుడు శిష్యుడు కావడం విశేషం. అందువల్ల బాబుకు ఆయనతో  మరింతగా సాన్నిహిత్యం నెరపడానికి అవకాశం ఏర్పడింది అంటున్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా మ్యాపులో పెట్టడంలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉండడంతో బాబు ఆయనకు కూడా ధన్యవాదాలు చెబుతూ లేఖ రాశారు.

 

ఇదిలా ఉండగా చంద్రబాబు  ప్రతి వీకెండ్ కి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ విలువైన సమయాన్ని ఆయన బీజేపీతో పొత్తు కోసం వాడుకుంటున్నారని అంటున్నారు. కిషన్ రెడ్డి ద్వారా తెలంగణాలో బీజేపీతో టీడీపీ పొత్తులు కుదిరిస్తే ఆ తరువాత ఏపీలో పొత్తులు మెల్లగా విస్తరించవచ్చునని బాబు ఆలోచన  చేస్తున్నారని అంటున్నారు. ఇక కిషన్ రెడ్డి హోం శాఖ సహాయ మంత్రిగా అమిత్ షా వద్ద పనిచేస్తున్నారు. దాంతో ఆయన ద్వారా అమిత్ షాను  ప్రసన్నం చేసుకోవడానికి కూడా బాబు గట్టి ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరి బాబు ప్రయత్నాలు విజయవంతం అవుతాయా లేదా అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: