ఉరిమి.. ఉరిమి... మంగళం మీద పడడమంటే ఇదే కాబోలు .   అటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు , ఇటు ప్రభుత్వం మంచిగానే ఉన్నాయి. కానీ మధ్యలో ఏ పాపం చేయని ప్రయాణికులు ఆర్టీసీ సమ్మె వల్ల జేబులు గుల్ల చేసుకోవాల్సిన  పరిస్థితి నెలకొంది . ఆర్టీసీని బ్రతికించుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ , సమ్మె వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు . ఆర్టీసీని పరిరక్షించుకోవాలంటే చార్జీల పెంపు తప్పనిసరని తేల్చేశారు . కిమీ కు 20  పైసలను పెంచుకునే వెసులుబాటు ఆర్టీసీ యాజమాన్యానికి కల్పిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు . ఆర్టీసీ పరిరక్షణ కోసం , చార్జీల పెంపును భరించాలని ప్రజలను కోరారు .

 

 ఆర్టీసీ అప్పుల్లో ఉందని , ఇక సంస్థ నిర్వహణ అతికష్టమని ఇటీవల కేసీఆర్ పేర్కొన్న విషయం తెల్సిందే . ఒకవేళ ఆర్టీసీని గట్టెక్కించాడని చార్జీలు పెంచుతామంటే ప్రజలు, బస్సులు  ఎక్కని పరిస్థితి నెలకొందన్న ఆయన, ఉన్నట్టుండి మాట మార్చి ఆర్టీసీ పరిరక్షణ కోసం  చార్జీల పెంపును భరించాల్సిందేనని చావు కబురు చల్లగా చెప్పారు . సోమవారం నుంచి చార్జీల పెంపు అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు . దీనితో ఆర్టీసీ లో ప్రయాణించే ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయమని తేలిపోయింది . ఇప్పటికే పెట్రోల్ , డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణం లో ప్రజా రవాణా వ్యవస్థ కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా చార్జీలను పెంచడం దారుణమన్న విమర్శలు విన్పిస్తున్నాయి .

 

 ఆర్టీసీని అధికంగా వినియోగించుకునేదని సామాన్య , పేద ప్రజలేనని వారిపై చార్జీల భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమేనా వాదనలు విన్పిస్తున్నాయి . ఆర్టీసీ కార్మికులు చేసిన తప్పుకు ప్రభుత్వం సామాన్యులను శిక్షిస్తామనడం ఎంతమాత్రం సరికాదని,  ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వం భరించి , పెంచిన చార్జీల ప్రకటనను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: