బాల్ థాక్రే అన్న పేరు మహారాష్ట్ర రాజకీయాలే కాదు, దేశంలో రాజకీయాలు తెలిసిన వారికి బాగా నానిన పేరే. బాలథాక్రే వంటి పులి కూడా చివరి రోజులో కడుపు తీపికి లొంగిపోయారు. ఆయనకు నిజమైన వారసుడు ఒకరు ఉన్నారు. అచ్చం బాలథాక్రే మాదిరిగానే ఆయనకు వాగ్దాటి ఉంది. ఆయనలా మరాఠాలను నిద్రలేపగల గర్జన ఉంది. అయినా ఆయన తమ్ముడు కుమారుడు అయిపోయాడు. అంతే అందుకే బయటకు వెళ్ళిపోవాల్సివచ్చింది.

 

ఆయనే రాజ్ థాక్రే. బాల్ థాక్రే తమ్ముడు శ్రీకాంత్ థాక్రే కుమారుడు. ఆయన బాలథాక్రేకు ఎపుడూ వెన్నుదన్నుగా ఉండేవారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన బాలథాక్రేకు తరువాత ఉంటారని అంతా అనుకున్నారు. అయితే మధ్యలో సొంత కుమారుడు ఉద్ధవ్ థాక్రే దూసుకు వచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపధ్యంలో అంటే 2004లో రాజ్ థాక్రే శివసేన నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అని ఒక పార్టీని ఏర్పాటు చేసి మరీ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నారు.

 

తాజగా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ తమ్ముడు రాజ్ ని కూడా ఉద్ధవ్ పిలిచారు. అంటే దాదాపు  దశాబ్దన్నర తరువాత అన్నదమ్ములు మాటలు కలిపారు. మరి అన్న ముఖ్యమంత్రి థాక్రే వంశంలోనే తొలి అధికారే పదవి. అయితే ఇక్కడో విషయం ఉంది బాలసాబ్ ఆశయాలను ఉధ్ధవ్ తుంగలో తొక్కాడని, కాంగ్రెస్ కాళ్ళ కింద పార్టీని, సిధ్ధాంతాలను పెట్టి మరీ కుర్చీ కోసం తెగించారని అంటారు.

 

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీద  తన సామ్నా పత్రికలో బాలసాబ్ రాసిన సంపాదకీయాలు అన్నీ కూడా కాంగ్రెస్ వారికి గుర్తే. మరి అటువంటి శివసేన ఇపుడు కాంగ్రెస్ మద్దతుతోనే కుర్చీ ఎక్కింది. దాంతో బాలసాబ్ ఆశయాలను నిలబెట్టే నాయకుడి కోసం ఇవాళ కాకపోయినా రేపు అయినా పోరాటం జరగకతప్పదు. బాలాసాహెబ్ మరణించి ఆరేళ్ళు అవుతోంది. ఆయన  తరువాత పార్టీని నడిపించడంతో ఉద్ధవ్ తడబట్లూ పొరపాట్లే చేస్తున్నారు. ఆయన రాజకీయ జీవితం సీఎం కుర్చీతోనే ఆగిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అపుడు శివసేన భూస్థాపితం కాకుండా జెండా, అజెండా తమ్ముడు రాజ్ థాక్రే పట్టుకుంటారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: