55 రోజుల పాటు జ‌రిగిన ఆర్టీసీ స‌మ్మె, ఆర్టీసీ ఉద్యోగుల భవితవ్యం, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గురువారం ప్రగతిభవన్లో సుదీర్ఘంగా స‌మీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్...ఎలాంటి షరతులు లేకుండా శుక్రవారం ఉదయానికల్లా ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సమ్మెకాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. బాధ్యత గల ముఖ్యమంత్రిగా, తెలంగాణ బిడ్డగా ఆర్టీసీ కార్మికుల‌ను త‌మ‌ బిడ్డలుగా భావించి.. రోడ్డున పడేయవద్దని చెప్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌తో ఆర్టీసీ కార్మికుల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే, దీని ఆధారంగా కార్మికుల‌కు చేరువ అవ్వాల‌ని చూసిన టీఆర్ఎస్ నేత‌ల‌కు షాక్ త‌గిలింది.

 

హయత్‌నగర్ డిపో దగ్గర టీఆరెస్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. స‌మ్మె విర‌మ‌ణ‌, ఆర్టీసీ కార్మికుల చేరిక నేప‌థ్యంలో కాకి డ్రెస్‌లో డిపోకు వచ్చిన కార్పొరేటర్‌ను కార్మికులు వెనక్కి తిప్పి పంపారు. ``ఇన్ని రోజులు ఎటు వెళ్ళావు? ఇప్పుడు ఫోటోల కోసం వస్తావా?``అని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కార్మికుల ఊహించ‌ని ఆగ్రహంతో కార్పొరేటర్ ఒకింత షాక్‌కు లోన‌య్యి...త‌న‌తో వ‌చ్చిన టీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి వెనక్కి వెళ్లిపోయారు. 

 

ఇదిలాఉండ‌గా, కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ స్పందించింది. సీఎం కేసీఆర్ నిర్ణ‌యాన్ని స్వాగతిస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. శుక్రవారం కార్మికులంతా ఉద్యోగాల్లో చేరాలని కోరారు. ఇది ఒక హ్యాపీ ఎండింగ్ అని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, మెడికల్ బెనిఫిట్ కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. ఆర్టీసీ స‌మ్మె ముగింపు నేప‌థ్యంలో వాళ్లు ఓడిపోయారా, వీళ్లు ఓడిపోయారా అనే చర్చలు పెట్టి కార్మికుల మనోభావాలు దెబ్బతీయవద్దని, కార్మికులు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలువలేదని పేర్కొన్నారు.  యూనియన్లను నిర్మూలించడం సాధ్యం కాదని, తాము ఉద్యమం చేసి వచ్చినవాళ్లమని, యూనియన్లలో లేకున్నా తమకు పోయేదేమీలేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: