మీరు హైద‌రాబాద్‌లో ఉన్నారా? జ‌ంట న‌గ‌రాల‌తో పాటుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న సైబ‌రాబాద్‌తో కనెక్ట్ అయ్యారా?  సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం లేక‌పోతే....ఇత‌ర వ్యాపార ప‌నులు, బంధువుల‌ను క‌లిసేందుకు హైటెక్‌సిటీ, గ‌చ్చిబౌలి వెళుతున్నారా? అయితే, ఇలా జ‌ర్నీ చేసే స‌మ‌యంలో మీ సొంత వాహ‌నం లేక‌పోతే...ప్ర‌జారవాణ‌తో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా? అయితే, నేటి నుంచి ఆ స‌మ‌స్య‌లే ఉండ‌వు తెలుసా? ఎందుకంటే.... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గం అందుబాటులోకి వ‌చ్చింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు.

 

మెట్రో రైల్  కారిడార్ -3 మార్గంలో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు రాకపోకలు సాగిస్తుండగా తాజాగా  1.5 కి.మీ. మార్గం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని మెట్రోరైలు అధికారులు తెలిపారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోరైలు ట్రయల్న్ జరుగుతున్నది. అతి త్వరలో కారిడార్-2కు సంబంధించిన మార్గం అందుబాటులోకి వస్తుంది. డిసెంబర్‌లో కారిడార్‌-2లోని జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. న‌గ‌ర‌మంతా మెట్రో రైలు సేవ‌లు అందుబాటులోకి వ‌స్తే హైద‌రాబాద్, సికింద్రాబాద్, సైబ‌రాబాద్ మ‌ధ్య రాక‌పోక‌లు సుల‌భం అవ‌డమే కాకుండా సౌక‌ర్య‌వంతంగా మారుతాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

 

ప్రస్తుతం మూడు కారిడార్ల కోసం 56 రైళ్లు ఉండగా, 45 రైళ్లు మెట్రో కారిడార్‌-1, 3లలో 800 ట్రిప్పులు నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గతంలో 15 నిమిషాలకో రైలు నడువగా, ప్రస్తుతం 5 నిమిషాలకు కుదించారు. హైటెక్‌సిటీ రివర్సల్‌ అందుబాటులోకి వచ్చాక ఫ్రీక్వెన్సీ పెంచి 5 నిమిషాలకో రైలు నడిపిస్తున్నారు. దీన్ని మూడు నిమిషాలకు తగ్గించనున్నారు. మూడు కారిడార్లలో రైళ్ల రాకపోకలు ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య ప్రారంభమై 5 లక్షల నుంచి 10 లక్షలకు చేరుకొంటుందని అంచనా. 

మరింత సమాచారం తెలుసుకోండి: