హైద‌రాబాద్ స‌మీపంలోని రంగారెడ్డి జిల్లాలో వెట‌ర్నరీ డాక్ట‌ర్ ప్రియాంక‌రెడ్డిని అమానుషంగా హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రెండు రోజులుగా త‌న కుమార్తె హ‌త్య సంఘ‌ట‌న‌తో షాక్‌లోకి వెళ్లిన ఆ కుటుంబ స‌భ్యులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా తండ్రి శ్రీధ‌ర్‌రెడ్డితో పాటు ఆమె సోద‌రి మీడియాతో మాట్లాడుతూ మరే తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పోలీసుల‌పై కూడా వీరు త‌మ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదన్నారు.

 

రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో తాను తొండుపల్లి జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో వెతికానని ప్రియాంక సోదరి భవ్య తెలిపారు. త‌న సోద‌రి బ‌య‌ట‌కు వెళ్లాక టైరుకు పంక్చ‌ర్ అయిన‌ప్పుడు త‌న చుట్టూ లారీ డ్రైవ‌ర్లు ఉన్నార‌ని... ఫోన్ చేసి భ‌యం భ‌యంగా మాట్లాడింద‌ని చెప్పింది. తాను ముందుకు వెళ్లి టైరు పంక్చ‌ర్ వేయించుకుంటాన‌ని చెప్పినా మేడ‌మ్ మ‌ధ్య‌లో ఆగిపోతే క‌ష్ట‌మ‌వుతుందంటూ తాము పంచ్చ‌ర్ వేయిస్తామ‌ని వాళ్లు ఓ చిన్న అబ్బాయికి స్కూటీ ఇచ్చి పంపార‌ని.. కొద్ది సేప‌టికి ఆ అబ్బాయి అక్క‌డ ఏ షాపులు లేవ‌ని తిరిగి స్కూటీ తీసుకు వ‌చ్చాడ‌ని.. ఈ విష‌యం అంతా త‌న సోద‌రి త‌న‌కు ఫోన్లో చెప్పిన‌ట్టు ప్రియాంక‌రెడ్డి సోద‌రి క‌న్నీటి ప‌ర్యంతం అవుతూ చెప్పింది.

 

తాను టోల్‌గేట్ బూత్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. అక్క‌డ స్కూటీ వ‌దిలేసి వ‌చ్చేయ‌మ‌ని చెప్పిన‌ట్టు కూడా ఆమె తెలిపింది. చివ‌ర‌కు అక్క‌డ వెతికాక తాము రాత్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని.. పోలీసులు మ‌రుస‌టి రోజు ఉద‌యం ఓ అమ్మాయి చ‌నిపోయింద‌ని ఫోన్ చేశార‌ని.. అక్క‌డ‌కు వెళ్లి చూస్తే అది త‌మ సోద‌రి ప్రియాంక మృత‌దేహం అని భోరున ఏడుస్తూ చెప్పింది. ఇక పోలీసులు విచార‌ణ చేస్తున్న‌ట్టు చెప్పార‌ని... ఈ త‌ప్పు చేసిన ఆ మృగాళ్ల‌ను ఖ‌చ్చితంగా ఉరి తీయాల్సిందేన‌ని... మేం కంప్లైంట్ ఇచ్చిన రోజునే పోలీసులు విచార‌ణ జ‌రిపి ఉంటే మా అమ్మాయి బతికి ఉండేదన్న ఆశ ఉండేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: