జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోని వాళ్ళకు టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే వాళ్ళ సామర్ధ్యం నిరూపించుకునేందుకు నాలుగు నెలలు మాత్రమే డెడ్ లైన్ ఉంది. ఇంతకీ డెడ్ లైన్ ఏమిటంటే మార్చిలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. ముందు సర్పంచు ఎన్నికలు తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని జగన్ డిసైడ్ అయ్యారు.

 

మంత్రులకు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఫలితాలకు జగన్ లింక్ పెట్టారు. ఏ జిల్లాలో అయినా జగన్  ఆశించిన ఫలితాలు రాకపోతే ఇన్చార్జి మంత్రికో లేకపోతే జిల్లా మంత్రికో మూడినట్లే. ఇద్దరిలో ఒకళ్ళని తప్పించటానికి జగన్ నిర్ణయించేసినట్లే ఉంది. అందుకే మొన్నటి క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా మంత్రులందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట.

 

ఒక విధంగా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికారపార్టీ గెలవటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఒక్కోసారి ఫలితాలు, అంచనాలు తల్లకిందులైన ఉదాహరణలు కూడా ఉన్నాయి లేండి. అందుకనే జగన్ ముందుగానే మంత్రులందరినీ హెచ్చరించారట. ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ 151 సీట్లను గెలిపించుకున్నారు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని ప్రజామోదమైన పథకాలు అమల్లోకి తెచ్చారు.

 

కాబట్టి వైసిపి తరపున రేపటి ఎన్నికల్లో పోటి చేయబోయే నేతల గెలుపు నల్లేరు మీద నడక లాంటిదనే చెప్పాలి. కనబడుతున్నదాని ప్రకారం టిడిపి తరపున గట్టి పోటి ఇవ్వగలిగిన నేతలు దొరకటం కూడా కష్టమనే చెప్పాలి.

 

ఇటువంటి పరిస్ధితుల్లో కూడా స్ధానిక సంస్ధల ఎన్నికలను వైసిపి గనుక క్లీన్ స్వీప్ చేయలేకపోతే అది కచ్చితంగా అధికారపార్టీ వైఫల్యమనే చెప్పాలి. అధికార పార్టీ వైఫల్యమంటే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల వైఫల్యంగానే పరిగణించాలి. ఇందులో కూడా మంత్రులదే ప్రధాన బాధ్యత. అందుకనే  ఫెయిలైన మంత్రులను తీసేయటానికి స్ధానిక ఎన్నికలను ఓ గీటురాయిగా జగన్ డిసైడ్ చేసుకున్నారు. అందుకనే మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏదేమైనా రెండున్నరేళ్ళు హయిగా గడిపేయచ్చని అనుకున్న మంత్రులకు కొత్త టార్గెట్ తో టెన్షన్ పెరిగిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: