ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఆశ్చ‌ర్యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. ఆర్టీసీ స‌మ్మెపై మొండిప‌ట్టుతోనే ఉంటారా...ఉదారంగా ముగింపు ప‌లుకుతారా? అనే ఆశ్చ‌ర్యం కొనసాగుతున్న త‌రుణంలో...ఇంకో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రగతిభవన్‌లో జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీ సమస్యపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని, కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం మరొక అవకాశం కల్పించాలని నిర్ణయించిందని తెలిపారు.ఎలాంటి షరతులు లేకుండా శుక్రవారం ఉదయానికల్లా ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల‌తో స్వ‌యంగా మాట్లాడుతా అని హామీ ఇచ్చిన కేసీఆర్‌...తాజాగా ఈ మేర‌కు షెడ్యూల్ విడుద‌ల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో స‌మావేశం అయ్యే తేదీల‌ను ఖ‌రారు చేశారు. 

 

ఆర్టీసీ కార్మికులతో తానే స్వ‌యంగా మాట్లాడుతాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ``రాబోయే ఐదారురోజుల్లో నేను ఢిల్లీకి పోవాల్సి ఉంది. ప్రధానమంత్రిని కలవాలి. ఎప్పుడు వెళ్లేది రేపు (శుక్రవారం) ఫైనల్ అవుతుంది. నేను ఢిల్లీ వెళ్లేలోగాకానీ, వెళ్లివచ్చిన తర్వాతకానీ.. వారంరోజుల లోపల ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ప్రగతిభవన్‌కు పిలిపించి.. వారితో స్వయంగా నేనే మాట్లాడుతా. సంస్థలో ఏం జరుగుతున్నదో వారికి చెప్తా. యూనియన్ నాయకులు చెప్తున్నరో లేదో నాకైతే డౌటు! వాళ్ల ఆర్థిక పరిస్థితుల గురించి, బస్సుల గురించి కిందవున్న కార్మికులకు తెలుసా తెలియదా.. యూనియన్ నిషాల పడి కొట్టుకపోతున్నారా తెలియదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులు, బస్సుల కండిషన్లు, అప్పులు, మంచి చెడ్డలు, ఇతర అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్‌ను తెలుగులో ప్రింట్ చేసి 49వేల కార్మికులకు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి చెప్పిన. చదువుకోండి.. వాస్తవాలు తెలుసుకోండి.. ప్రిపేర్ అయి నేను పిలిచే మీటింగ్‌కు రండి.. అందరం కలిసి మాట్లాడి భోజనం చేసి నిర్ణయం తీసుకుందాం.`` అని ప్ర‌క‌టించిన కేసీఆర్ ...ఈ మేర‌కు తెల్ల‌వారే స‌రికే...ఆ వివ‌రాలు వెల్ల‌డించారు. 

 

 

డిసెంబర్ 1 ఆదివారం ప్రగతి భవన్‌లో కార్మికుల‌తో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని,  అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం కోరారు. డిసెంబర్ 1న మద్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని, వారికి ప్రగతి భవన్ లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సిఎం చెప్పారు. మద్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండి, ఇ.డి.లు, ఆర్.ఎం.లు, డివిఎంలను ఆహ్వానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: