అమెరికాలో ఉన్నత విద్యకోసం కలలు కంటున్న విద్యార్థుల బలహీనతలను ఆసరాగా చేసుకొని  దళారులు రెచ్చిపోతున్నారు. తమ ఉచ్చులోకి లాగి నిలువునా దోచుకుంటూ ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ఫార్మింగ్టన్ యూనివర్శిటీలో చదువుతున్న 90 భారత విద్యార్ధులను అరెస్ట్‌ చేశారు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.


వీసా పొందడానికి నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన 90 మంది ఇండియన్స్‌ అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మెట్రోపాలిటిన్ ఏరియాలో మూసేసిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌లో ప్రవేశం పేరుతో వీసాపై అమెరికాలోకి వచ్చిన 250 మందిని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదుపులోకి తీసుకుంది.


ఈ నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన 161 మందిని ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. ఈ వర్సిటీని మార్చిలోనే మూసివేయగా ప్రస్తుతం 600 మంది విదేశీ విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందారు. వీరిలో అధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారు. ఇది నకిలీ యూనివర్శిటీ అని తెలిసిన విద్యార్ధులు కావాలనే చేరుతున్నారని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలుపుతున్నారు.

 

నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొంది, చట్టబద్దంగా అమెరికా ఎంబసీ నుంచి వీసా దక్కించుకున్నవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. చట్టబద్ధంగా వీసాను పొందడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులను కొంతమంది తమ ఉచ్చులోకి లాగుతున్నారు దళారులు. అమెరికాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో యూనివర్శిటీలో చేరిన విద్యార్థులను అరెస్టు చేయడం క్రూరమైన చర్యగా ట్రంప్‌ సర్కార్‌పై డెమోక్రాటిక్‌నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి నకిలీ యూనివర్సిటీ ఉచ్చులో అమాయక విద్యార్థులు చిక్కుకున్నారు. ఉన్నత చదువులు చదవాలనే ఆశతో.. దళారుల మాటలు నమ్మి మోసపోయారు. తీరా ఆ యూనివర్సిటీలో చేరాక.. అదంతా ఫేక్ అని తెలిసేలోపే చేతికి సంకెళ్లు పడ్డాయి. ఇపుడేమి చేయాలో పాలుపోక జైల్లో మగ్గుతున్నారు. ఎలాగైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమను విడిపించాలని కోరుతున్నారు. చదువు విషయంలో ఎవర్నీపడితే వాళ్లను నమ్మి తమలా మోసపోవద్దని తోటి విద్యార్థులకు హితవు పలుకుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: