టీడీపీ అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అమరావతి పర్యటనను అడ్డుకోవడానికి అధికారపార్టీ చేసిన దుష్కార్యాలను ప్రజలు గమనించారని, ప్రతిపక్ష నేతను అడ్డుకోవడానికి ప్రభుత్వమే కొందరు కిరాయివ్యక్తులను నియమించి, పోలీస్‌ శాఖ సహయ, సహాకారాలతో ఆయనపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడిందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాముచేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ప్రభుత్వం అనేకదుశ్చర్యలకు  పాల్పడినా  ప్రతిపక్షనేత అమరావతి పర్యటన విజయవంతమైందన్నారు. 
ప్రజాస్వామ్యంలో రోడ్లపై తిరిగేహక్కును హరించేలా, సిగ్గుమాలినచర్యకు పాల్పడిన ప్రభుత్వం, రాజధాని నిర్మాణాలకు సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలియచేశాడన్న అక్కసుతోనే చంద్రబాబుపై దాడికి పూనుకుందన్నారు. చంద్రబాబు పర్యటనకు పోటీగా, కావాలనే కొందరు వైసీపీ కార్యకర్తలను సమీకరించి, పోలీసులే  వారిచేత నిరసనప్రదర్శనలు నిర్వహించడం జరిగిందన్నారు. 

ప్రజలహక్కులకు భంగం కలిగితే పోలీసులను ఆశ్రయిస్తారని, అలాంటి పోలీసులే లాఠీలు విసరడం దారుణమని నక్కా మండిపడ్డారు. రాజధానిలో నిర్మితమైన భవనాలను, రోడ్లను, జరిగిన పనులను ప్రభుత్వం, ప్రజలదృష్టికి తీసుకెళ్లడానికే చంద్రబాబు అమరావతిలో పర్యటించాడన్నారు. 90 శాతానికిపైగా పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌, ఆల్‌ఇండియాసర్వీసెస్‌ ఉద్యోగుల  ఉద్యోగుల వసతిసముదాయాలు, బలహీన వర్గాలకు చెందిన 5వేలకుపైగా ఇళ్లనిర్మాణాలు, వందలకిలోమీటర్ల వరకు వేసినరోడ్లు అక్కడ పూర్తవడం జరిగిందన్నారు. 
అమరావతిఅంతా గ్రాఫిక్స్‌ంటూ దుష్ప్రచారం చేసిన అధికారపార్టీనేతలు, మంత్రుల బాగోతం ఎక్కడ బయటపడుతుందోనన్న అక్కసుతోనే చంద్రబాబుపై దాడికి ప్రయత్నిం చారన్నారు. ప్రతిపక్షనేత అమరావతి పర్యటన వివరాలు ప్రసారమాధ్యమాల్లో కూడా రాకూడదన్న దురుద్దేశంతోనే 7, 8మంది ఎమ్మెల్యేలు, 9మంది మంత్రులు అరగంటకో పత్రికాసమా వేశం నిర్వహించారని నక్కా తెలిపారు. ప్రజాస్వామ్యానికి పాతరేసేలా అధికారపార్టీ వ్యవహరించిందన్నారు.  

డీజీపీస్థాయి వ్యక్తి, చంద్రబాబుపై జరిగిన దాడిని సమర్థించడం సిగ్గుచేటని, బాధ్యతాయుత ంగా వ్యవహరించాల్సిన పోలీస్‌బాస్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడని మాజీమంత్రి మండిప డ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసనతెలిపే హక్కు ఎవరికైనా ఉందంటూ ప్రతిపక్షనేతపై జరిగిన దాడిని డీజీపీ సమర్థిస్తున్నాడని, నిరసనపేరుతో చెప్పులు, రాళ్లు, కర్రలతో మాజీ ముఖ్యమంత్రిపై దాడిచేస్తుంటే పోలీస్‌వారు చూస్తూ కూర్చున్నారని నక్కా తెలిపారు. రాష్ట్రంలో భయానకవాతావరణం కొనసాగుతున్నా కూడా పోలీసుల్లో చలనం లేదన్నారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడిచేస్తూ, ప్రజల గొంతును నొక్కేయాలని చూస్తున్నారన్నారు. 5 కోట్లమందికి అవసరమైన రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. 33వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాలపై కూడా వైసీపీ ప్రభుత్వం కులం పేరుతో విషం చిమ్ముతోందన్నారు. దుశ్చర్యలు, దాడులతో పాలనసాగిస్తున్న అధికారపార్టీకి సరైన సమయంలో తగినవిధంగా బుద్ధిచెబుతామని ఆనందబాబు హెచ్చరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: