డాక్టర్‌ ప్రియాంకను కాపాడడంలో హైదరాబాద్‌ పోలీసులు ఫెయిలయ్యారా..? ఫిర్యాదు అందగానే స్పందించని పోలీసులు... తర్వాత హడావుడి చేశారా..? ఫలానా చోటే ప్రియాంక మిస్సయ్యిందని తల్లిదండ్రులు మొత్తుకున్నా... పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు..? మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీసుల వైఖరిలో ఎందుకు మార్పు రావడం లేదు? ప్రభుత్వం మహిళా పోలీస్‌ స్టేషన్లు, షీ టీమ్స్‌ ఏర్పాటు చేసినా నేరాలు ఆగకపోవడానికి కారణం ఇదేనా..? 

 

ఛీత్కారాలు... పరుష పదజాలాలు... కేసు తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం... ఇదీ ప్రియాంక తల్లిదండ్రులకు పోలీసులతో ఎదురైన అనుభవం. కూతురు కనిపించడం లేదంటూ సాయం కోసం తాము పోలీస్‌ స్టేషన్‌కు పరిగెత్తుకుంటూ వెళ్తే... ఎవరితోనే లేచిపోయి ఉంటుందిలే అని తక్కువ చేసి మాట్లాడారంటున్నారు ప్రియాంక తల్లిదండ్రులు.   


పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ... తమ కూతురు కనిపించడం చెబుతుంటే పట్టించుకున్న పాపానికి పోలేదంటున్నారు ప్రియాంక తల్లిదండ్రులు. ఆ సమయంలో కూతురు కనిపించడం లేదనే బాధకంటే... పోలీసులు చేస్తున్న కామెంట్సే తమను ఎక్కువగా బాధించాయంటున్నారు.  చివరికి మీరే వెతుక్కోండంటూ ఓ కానిస్టేబుల్‌ను ఇచ్చి పంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రియాంక తండ్రి. 

  
పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ కూతురు కనీసం ప్రాణాలతోనైనా తమకు దక్కేదని కన్నీళ్లుపెట్టుంటున్నారు ప్రియాంక తల్లిదండ్రులు. కేసు పురోగతికి సంబంధించి కూడా తమకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం లేదంటున్నారు ప్రియాంక పేరెంట్స్‌. మొత్తానికి నడి రోడ్డుపై ప్రియాంకను కిడ్నాప్‌ చేసిన దుండగులు...  అత్యాచారం చేసి చంపి... ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని దగ్ధం చేసే వరకూ పోలీసులు ఏం చేశారన్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు? మొత్తానికి తమ ముద్దుల కూతురు ప్రియాంక కనిపంచలేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అవమానమే జరిగింది. ఇలాంటి దుస్థితి మరే తల్లిదండ్రులకు పట్టకూడదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: