ఆడది లేకపోతే స్రుష్టి లేదు అంటారు. మగవాడు అయినా ఆడది అయినా పుట్టేది ఆడదాని కడుపునే అని కూడా అంటారు. అటువంటిది ఆడవారిని  కనీసం సాటి జీవిగా కూడా ఎందుకు చూడలేకపోతున్నాం. వారి ఎపుడూ మగవారి కంటే తక్కువ అన్న భావననే యుగాలుగా ఎందుకు మోస్తున్నాం. ఆడది అబల అంటూనే  తరతరాలుగా ఆమెని చిదిమేస్తున్నాం.  ప్రియాంకరెడ్డికి జరిగిన దారుణానికి సభ్య సమాజం సిగ్గుపడాలి. ఇది సమాజం చేసిన హత్యగా ప్రతీ ఒక్కరూ  భావించాలి.

 

ఆమె ముఖం చూస్తే ఒక తేజస్సు కనిపిస్తోంది. భవిషత్తుపై ఎంతో ధీమా వ్యక్తం  అవుతోంది. ఆ తండ్రికి ఇద్దరు కూతుళ్ళు ఉంటే ఇద్దరూ కొడుకుల కంటే మిన్నగా రాణించారు. చదువుల సరస్వ‌తులే అయ్యారు. వెటర్నరీ డాక్టర్ గా ప్రియాంకా రెడ్డి తన విధి నిర్వహణలో ముక్కుసూటి అని, మూగ జీవాలకు సేవ చేస్తూ తన కర్తవ్యం కచ్చితంగా అమలు చేసే అధికారిణి అని ఆమె పనిచేసే చోట చెబుతున్నారు.

 

ఆమె కష్టపడి పైకి వచ్చింది. సొంతంగా కాళ్ళపైన నిలబడింది. ఈ సమాజం తనకు అండగా ఉంటుందని భ్రమించింది. తెల్లనివి అన్నీ పాలే అనుకుంది. అందుకే అక్కడ ఉన్న లారీ డ్రైవర్లను కూడా తనకు సహాయంగా ఉంటారని  నమ్మింది. కానీ వారు కిరాతకులని జనారణ్యంలో తిరిగే క్రూర మ్రుగాలని వూహించలేకపోయింది.  వారు  కుట్ర చేసి మరీ తన స్కూటీని పంక్చర్ చేశారని అసలు అనుకోలేకపోయింది.

 

ఆడది కనిపిస్తే ఆబగా మీదపడి పశువాంచను  తీర్చుకుని కాటేసే మ్రుగాళ్ళు వారు అని ప్రియాంకారెడ్డికి తెలియకపోవడం తప్పే. కానీ ఆమె చదువు సంస్కారం ఆమెను అలా ఎప్పటికీ ఆలోచించనివ్వవు. కాబట్టే మనిషి అని, అతనికి మానవత్వం ఉంటుందని నమ్మింది. కానీ వారు మాత్రం అడవిలో జింకను వేటాడినట్లుగా వేటాడారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి మరీ కసి దీరా చంపేశారు. ఆనక ఆమె మ్రుతదేహాన్ని ఘోరగ్నా తగులబెట్టారు. 

 

 

అయితే ఇక్కడ వారు చంపింది ప్రియాంకను కాదు, మానవత్వాన్ని, హత్య చేఅసింది మంచి తనాన్ని, స్రుష్టికి ప్రతిరూపమైన ఆడదాన్ని, గొప్పగా బతుకుతున్నామనుకుని భ్రమంల్లో ఉన్న సమాజాన్ని. మొత్తానికి ఈ హత్య సమాజం చేసినదేనని చెప్పాలి. అసలు ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి. ఈ లోకంలో ఆడదానిగా పుట్టడమేనా. ఈ ప్రశ్నకు ప్రతీ ఒక్కరూ జవాబు చెప్పాలి. మనిషి అనిపించుకుంటున్న, పిలిపించుకుంటున్న  వారి నుంచి సమాధానం రావాలి.

 


దీనికి అంతా బాధ్యత వహించాలి. సిగ్గుతో తలదించుకోవాలి. ఆడదాని కడుపున పుట్టి అదే ఆడదాన్ని కాటేసే క్రూర జంతువులు ఉన్నంతవరకూ ఈ భూమి మీదకు మరో ఆడది వచ్చేందుకు భయపడుతుంది. ఈ భూమి మీద నేను పుట్టను కాక పుట్టను అని ఒట్టుపెట్టుకుంటుంది. అపుడు స్రుష్టి  ఏమవుతుంది... మగాడు ఎక్కడ బతుకుతాడు. అసలు ఉనికిలో కనిపిస్తాడా..ఆడదాన్ని కబలించేముందు కనీసం తన గురించి అయినా ఆలోచన చేసుకుంటున్నాడా.

 


ఆడది అన్నది లేకపోతే  లోకమే తిరగబడిపోతుంది, మానవ మనుగడ ప్రశ్నార్ధం అవుతుంది. ఆడది లేని అవని ఉంటుందా. ఉండగలదా. ఆడదే లేకపోతే ఎక్కడ మగాడు పుడతాడు. ఎక్కడ మానవజాతి బతుకుతుంది. ఈ ప్రశ్నలు ఇప్పటికైనా మనసులో ఎవరికి వారు వేసుకోవాలి. ఆడవారిని కాపాడుకోవాలి. మొక్కలను నాటుదాము అని పిలుపు ఇస్తున్నారు. మంచిదే, కానీ అంతకంటే ముందు ఆడవారిని కాపాడుకుంటామంటూ పెద్ద ఉద్యమం రావాలి. అపుడే ఆడది బతుకుతుంది. ఆమె ఒక్కతే కాదు, వెనకలా దుర్బలుడు అయిన మగాడు కూడా బతుకుతాడు. అపుడు మానవజాతి, మానవత్వం   కూడా బతుకుతాయి. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: