అమరావతిలో గురువారం చంద్రబాబునాయుడు పర్యటనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఉద్ధండరాయునిపాలెం గ్రామంలో చంద్రబాబు సినిమా టిక్ స్ధాయిలో నేలపై సాష్టాంగ నమస్కారం చేయటంపై  జనాలు ఒకటే జోకులు వేసుకుంటున్నారు. ఇంద్ర సినిమాలో చిరంజీవి లెవల్లో చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లు సరదాగా చెప్పుకుంటున్నారు.

 

ఇక ఉదయం నుండి సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్ మొదలైంది. బోర్లా పడుకుని కలలు కంటే అమరావతి కాస్త భ్రమరావతిగా మారిపోయి లేని భవనాలు, జరగని అభివృద్ధి మొత్తం కళ్ళముందు ప్రత్యక్షమవుతాయని చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు నమస్కారం చేస్తున్న ఫొటోకు అమరావతి గ్రాఫిక్స్ ఫొటోలను జత చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు.

 

జరుగుతున్న ట్రోలింగ్ కు తగ్గట్లే చంద్రబాబు కూడా ఏవేవో మాట్లాడేస్తున్నారు. ఐదేళ్ళపాటు అధికారంలో ఉండి కట్టిందే మూడు తాత్కాలిక నాసిరకం నిర్మాణాలు. అవికూడా నిర్మాణ ఖర్చులను భారీగా పెంచేసి వందల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని దోచేసుకున్నారు. జరిగిన అవినీతి కళ్ళకు కనబడుతోంది. జరిగినవి నాసిరకం నిర్మాణాలని  తెలిసిపోతోంది. చిన్నపాటి వర్షానికి కూడా తాత్కాలికంగా కట్టిన సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టు లోపల  విపరీతంగా కురుస్తున్నాయి.

 

ఇంతోటి పనికిమాలిన నిర్మాణాలను చేసి తానేదో అద్భుతమైన భవనాలను కట్టేసినట్లు చంద్రబాబు ఇప్పటికీ అదే బిల్డప్ ఇస్తుండటమే విచిత్రంగా ఉంది. ఉన్నతాధికారులు, అధికారుల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు నిర్మాణదశల్లో ఉన్నాయి. ఇవి పూర్తయితే కానీ వీటి నాణ్యత ఏమిటో ఎవరికీ తెలీదు.

 

మరికొన్ని భవనాలకు పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చారే కానీ నిధులు లేనికారణంగా పనులు మొదలుకాలేదు. వాస్తవాలు ఇలాగుంటే తానేదో రూ. 2 లక్షల కోట్ల సంపద సృష్టించానంటూ ఒకటే ఊదరగొడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు అవసరమైన రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో కేటాయించిందే రూ 5 వేల కోట్లు. ఈమాత్రం దానికే మొత్తం నిధులంతా కేటాయించేసినట్లు, ఖర్చు పెట్టేసినట్లు చెప్పేసుకుంటున్నారు. అందుకనే నెటిజన్లు చంద్రబాబుపై విపరీతమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: