భార‌త‌దేశ‌మంతా...త‌మ ప‌రిపాల‌నే ఉండాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ద్వ‌యానికి మహారాష్ట్రలో భారీ షాక్ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. మహారాష్ట్రలో మెజార్టీ లేక‌పోయినా ఎన్‌సీపీ అసంతృప్త నేత అజిత్ ప‌వార్ మ‌ద్ద‌తుతో  అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. అయితే, శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమి ఆ స‌ర్కారును గద్దె దించి అధికారంలోకి వచ్చిన విషయ‌మూ విదిత‌మే. ఈ ప‌రిణామం రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు స‌రిగ్గా అదే సీన్ బీజేపీ పాలిత రాష్ట్రమై గోవాలోనూ త్వరలో జరగబోతోందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. త‌ద్వారా బీజేపీ ముఖ్యుల‌కు షాకిచ్చారు. 

 

శివ‌సేన త‌ర‌ఫున కీల‌క అంశాల‌పై దూకుడుగా స్పందించే ఎంపీ సంజయ్‌ రౌత్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గోవాలో త్వ‌ర‌లో అద్భుతం జ‌ర‌గ‌బోతోందంటూ పరోక్షంగా అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని కుప్పుకూలుస్తామ‌ని సిగ్న‌ల్స్ ఇచ్చారు. కాషాయా పార్టీలో భాగ‌స్వామి అయిన ‘గోవా ఫార్వర్డ్‌ పార్టీ’ అధ్యక్షుడు విజయ్‌ సర్దేశాయ్‌ శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.  ‘‘మ‌హారాష్ట్ర వ‌లే గోవాలోనూ త్వరలో అద్భుతం జరగబోతోందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్‌ సహా వివిధ పార్టీలతో కొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాం. ’’ అని సంజయ్ రౌత్ బాంబు పేల్చారు. ఇప్పుడు తమ దృష్టంతా గోవాపైనే ఉందని చెప్పుకొచ్చారు. ఇంత‌టితో ఆగ‌కుండా గోవా తరవాత ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారిస్తామని.. దేశవ్యాప్తంగా బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలకుంటున్నామని సంజయ్ రౌత్ ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేకెత్తించారు.

 

కాగా,   శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఛత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరిస్తూ దైవసాక్షిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేశారు. దాదర్ లోని ప్రఖ్యాత శివాజీ పార్కులో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేతోపాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ నేత టీఆర్ బాలు, కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సుప్రియాసూలే సహా ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: