చంద్రబాబునాయుడుకు ఎస్సీ నేత కారెం శివాజీ పెద్ద షాకే ఇచ్చారు. టిడిపి హయాంలో ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ గా పనిచేసిన కారెం హఠాత్తుగా శుక్రవారం సాయంత్రం వైసిపిలో చేరారు. తెలుగుదేశంపార్టీ నేతలు ఎవరు కూడా కారెం పార్టీ మారుతారని ఊహించలేదు. అలాంటిది కారెం పార్టీ మారటంతో అందరూ షాకయ్యారు.

 

నిజానికి కారెం ఏమీ పెద్ద రాజకీయ నేత అని చెప్పలేం. ఎస్సీలో కూడా తిరుగులేని నేత అని కూడా అనుకునేందుకు లేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడటానికి మొహమాటపడని కారెంను చంద్రబాబు కావాలనే చేరదీశారు. దానికి తగ్గట్లే ఈయన కూడా జగన్ పై అలాగే విరుచుకుపడేవారు.

 

అందుకనే కారెంకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా చంద్రబాబు నియమించి బాగానే ప్రోత్సహించారు. అయితే కారెం నియామకంపై కోర్టులో కేసు వేయటం కోర్టు కూడా నియామకాన్ని కొట్టేయటం అన్నీ తెలిసిందే. సరే కోర్టు తీర్పు ఎలాగున్నా చంద్రబాబు కూడా ఏదో పద్దతిలో మళ్ళీ ఆయనకే ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.

 

ఈ నేపధ్యంలోనే ఎన్నికలు జరగటం తెలుగుదేశంపార్టీకి మాడు పగలటం అన్నీ జరిగిపోయాయి. ఇక్కడ గమనించాల్సిన విచిత్రమేమిటంటే ప్రభుత్వం మారినా తన ఛైర్మన్ పదవికి మాత్రం కారెం రాజీనామా చేయలేదు. ప్రభుత్వం మారిన ఆరుమాసాలకు అంటే కేవలం నవంబర్ 28వ తేదీన మాత్రమే కారెం తన పదవికి రాజీనామా చేశారు.

 

అంటే 28వ తేదీన ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన కారెం 29వ తేదీ మధ్యాహ్నానికి టిడిపికి రాజీనామా చేయటం సాయంత్రానికి వైసిపిలో చేరటం అన్నీ చకచక జరిగిపోయింది.  కారెం పార్టీ మారిన విషయం తెలియగానే టిడిపి నేతలు ఆశ్చర్యపోయారు. ఏం చేస్తాం పార్టీమీద కమిట్మెంట్ లేని వారిని అందలాలెక్కించటం పార్టీ ఓడిపోగానే వాళ్ళుంతా టిడిపికి రాజీనామా చేయటం అలావాటుగా మారిపోయింది. చంద్రబాబు చేతికి పగ్గాలు వచ్చినప్పటి నుండి చాలామంది నేతల వరస ఇలాగే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: