నిశీది చిరాకు పడుతుంది. ఎందుకంటే పచ్చి నెత్తురు కోసం అర్రులు చాచే కామాంధులను చూసినప్పుడూ.. రక్షణలేని ఆడ బ్రతుకులు పొలిమేర్లలో గ్రామా దేవతల ప్రహరా కాసే నీఛుల చేతిలో చిక్కి వారికి ఆహారమవుతున్నప్పుడు ఆ సంఘటనలను వినోదంగా భావిస్తూ ఆనందిచే దొంగనాయళ్ల ముఖాలు చూసినప్పుడు అమ్మ పేగు ప్రసవం కోసం అల్లాడినట్లుగా ఈ హృదయం విలవిలలాడుతుంది. మనిషితత్వానికి ఆవల స్మశాన సంస్కృతికి దగ్గరిగా బ్రతుకుతున్న ఈ బ్రతుకులను చూస్తుంటే గడుచుచున్న కాలం వెక్కిరిస్తుందన్న భావన లోలోన కాల్చివేస్తుంది.

 

 

ఈ లోకంలో కామం ప్రేతత్మలు, రాక్షసముహాలుగా మారి విలపిస్తున్న ఆడపిల్ల ఆర్తనాదం పట్టించుకోక పైశాచిక ఆనందం పొందుతుంటే ఆడపిల్ల అంటే మగవాడి కామం అనే ఆకలి తీర్చే పిల్లలా వినిపిస్తుంది సమాజానికి. ప్రతి రాత్రి కోరికలు భయానకంగా జడలు విప్పుకుని కొరివిదయ్యంలా తిరుగుతుంటే కామంతో  ఎర్రబారిన కళ్లను గమనించని అమాయకపు పిల్ల ఆడపిల్ల అవుతుంది.

 

 

ఈ సమయంలో రాక్షసత్వము మనిషి మనసుతో వియ్యమందుతు కయ్యానికి కాలుదువ్వుతూ దుష్టసమూహాల కూటమి ఏర్పాటు చేసుకుని పిశాచాల్లా ఆడపిల్లల కోసం వెతుకుతుంటే అది చీకటి కమ్మేసిన భయానక నిశీదిలా మారుతుంది. మానవత్వానికి మురికి మకిలిని అంటించుకుని బ్రతుకుతున్న ఈ బ్రతుకులు చూస్తుంటే రాలిపోయే ఆడపిల్లల జీవితాల కన్నీటి చుక్కలు ఒక్క సారైన ఈ బ్రతుకు మురికిని కడగక పోతాయా అనే ఆశ రోజు రోజుకు చచ్చిపొతుంది.

 

 

ఎందుకంటే రెండు రోజులలో ఆరుమంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇలా లోకంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఊహించడం కష్టం. మాటలతో మాయ చేసే నాయకులు, దోషులను కూర్చోపెట్టి సంవత్సరాలు పోషించే చట్టాలు ఉన్నంత కాలం వ్యవస్ద ఇలాగే ఉంటుంది. ఇలాంటి కామాంధులూ పుట్టుకొస్తూనే ఉంటారు. ఇది ఓ తండ్రి వ్యధ కాదు. ఓ తల్లి కడుపుకోత కాదు. ఓ అన్న కన్నీటి గోస కాదు. ప్రతి గుండెలో బరువైన మాటలు. పెదవులు దాటి బయటపడని చీకటి వేదనలు. ఇప్పటికైన మేలుకోకుంటే ప్రపంచమే శ్మశానం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: