వైద్యురాలు ప్రియాంకారెడ్డి తన సోదరికి బదులుగా పోలీసుల సహాయం కోసం 100 నెంబర్ కు ఫోన్ చేసి ఉంటే, పోలీసులు ఆమెను కాపాడి ఉండే వారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి  .  తాము, తమ కూతురు మిస్సయిందని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే,  తమ పరిధిలోకి రాదంటే , తమ పరిధిలోకి  రాదని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ , రూరల్ పోలీసులు రెండు గంటలపాటు సమయాన్ని వృధా చేశారని ప్రియాంక తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు .

 

 తాము ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి మిస్సయిన ప్రదేశం లో గాలింపు చేపట్టి ఉంటే కనీసం ప్రాణాలతోనైన తమ  బిడ్డ తమకు దక్కి ఉండేదని వారు అంటున్నారు . అంతేకాని,  జరగాల్సిన సంఘటన జరిగిపోయిన తరువాత పది బృందాలను ఏర్పాటు చేస్తే ఏమి లాభమని ప్రశ్నిస్తున్నారు . ఇక ప్రియాంకారెడ్డి  అత్యాచార , హత్య ఘటన కేవలం 40  నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేర్కొనడం పరిశీలిస్తే, ఆమె తల్లితండ్రులు తమ వద్దకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వెంటనే  ఎయిర్ పోర్టు పోలీసులు స్పందించి, ఆమె కోసం గాలింపు చేపట్టి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదన్నా అభిప్రాయం వ్యక్తం అవుతోంది .

 

 తమ వద్ద వాహనం కూడా లేదని చెప్పిన రూరల్ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఎయిర్ పోర్ట్ పోలీసులు , ఉచిత సలహా పడేసి ఉరుకోవడమే కాకుండా , రూరల్ పోలీసులు తమ పరిధిలోకి రాదని తేల్చిన తరువాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పేరిట కాలయాపన చేయడం పై  విమర్శలు వెల్లవెత్తుతున్నాయి . తల్లితండ్రుల వెళ్లి ఫిర్యాదు చేస్తేనే దిక్కు … ముక్కు లేదని ఇక 100  కు ఫోన్ చేయగానే వచ్చి పోలీసులు సహాయం చేసేవారని మహమూద్ అలీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు మండిపడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: