కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన కన్నా లక్ష్మీనారాయణ నిజానికి గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాల్సిన వారే. కానే అక్కడ ఆయన రాజకీయ ప్రత్యర్ధి రాయపాటి సాంబశివరావు అక్కడ ముందే  ఉండడం వల్ల సైకిలెక్కలేకపోయారని అంటారు. బీజేపీలో చేరిన కన్నా మొత్తానికి ఆ పార్టీలో ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన‌ మళ్ళీ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు. అదే విధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీలైతే ఇంకా రాజ్యసభ సీటు లాంటివి  ఏవో కావాలనుకుంటున్నారు.

 

అయితే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి  ఎంట్రీతో ఏపీ బీజేపీలో సీన్ మూడు ముక్కలాటగా మారింది. కన్నా వర్గం, సుజనా వర్గం, పాత బీజేపీ వర్గం ఇలా గ్రూపులుగా మారిపోయింది. ఐతే ఈ మధ్య సుజనా చౌదరి కన్నా లక్ష్మీ నారాయణల మధ్య సాన్నిహిత్యం వెల్లివిరుస్తోందని అంటున్నారు.

 

కన్నా లక్ష్మీనారాయణ తాజాగా సుజనాచౌదరి ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి  మరీ జగన్ని తిట్టడంతో ఈ ఇద్దరిదీ ఒకటే వాణి బాణి అని కాషాయ పార్టీలో మిగిలిన వారికి కూడా అర్ధమైంది. సుజనాచౌదరి చంద్రబాబు గొంతునే వినిపిస్తారని బీజేపీలో అసంత్రుప్తి గట్టిగా ఉంది. ఇక  పాత కాపు సోము వీర్రాజు బీజేపీలో తన ప్రాధాన్యత పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి మరీ పార్టీలో చేరమని ఆహ్వానించారు. ఆ విధంగా  ఏపీ బీజేపీలో తన వర్గంతో పాటు పలుకుబడి పెరుగుతుందని సోము వీర్రాజు ఆశించారు.కానీ చిత్రంగా ఇపుడు కన్నా, సుజనా ఒక్కటిగా మారడంతో ఏపీ బీజేపీలో మరో మారు కన్నా ప్రెసిడెంట్ గా ఉంటారన్న మాట వినిపిస్తోంది. ఇక కేంద్ర మంత్రి పదవిని మరో మారు ఆశిస్తున్న సుజనా చౌదరి కూడా కన్నా సహకారం కోరుకుంటున్నారు.

 

ఇలా బీజేపీలోకి కొత్తగా వచ్చి చేరిన వారి దూకుడుతో పాతకాపులు, బీజేపీనే నమ్ముకున్న వారు ఇపుడు కలవరపడుతున్నారు. కేంద్ర నాయకత్వం మరి ఏ విధంగా ఆలోచన చేస్తుంది, పాతవారికి ప్రాముఖ్యత ఇస్తుందా, లేక కొత్త వారితో కొత్త బలం కోసం ప్రయత్నం చేస్తుందా అన్నది చూడాలి. బీజేపీకి ఏపీలో పెద్దగా బేస్ లేదు కానీ గ్రూపులు మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: