యావత్తు దేశం అత్యంత ఆసక్తితో ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించనంత భారీ విజయాన్ని వైఎస్ జగన్ సాధించారు. మే 30, 2019 న నవ యువ ఆంధ్రప్రదేష్ కు రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం ఆరు నెలల్లోపు మీతో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని మాట ఇచ్చారు. నేటితో (నవంబర్ 30, 2019) జగన్ ఆరు నెలల పాలన పూర్తి అయింది. మరి తను ఇచ్చిన మాటను ఎంత వరకు నిలబెట్టుకున్నారో చూద్దాం. 

 

ఈ ఆరు నెలల్లో జగన్ సాధించిన విజయాలు ఇవే:

 

ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వృద్ధాప్య పింఛన్ పెంపు పై తొలి సంతకం చేశారు. తొలి రోజు నుంచి, తాను ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 'నవ రత్నాలు' సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూసారు. ఒకేసారి 4 లక్షల గ్రామ వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. ఎన్నికల సందర్బంగా ఆర్టీసిని ప్రభుత్వంలో వీలీనం చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఆర్టీసి విలీనంపై ఉన్నత స్థాయి కమిటీ వేసారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ,ఎస్సి,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అయిదుగురు వ్యక్తులను డిప్యూటీ సీఎంలు గా నియమించారు.

 

అమ్మ ఒడి పథకం కింద తమ పిల్లలను బడికి పంపిన ప్రతీ తల్లికి రూ 15 వేలు ఆర్ధిక సాయం ప్రకటించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించి బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించారు. అలాగే బార్ షాపుల లైసెన్స్ ఫీజులు సైతం పెంచారు. క్రమక్రమంగా మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. ఎంతటి వారైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించమని అవినీతిపై పిర్యాదు చెయ్యడానికి 14400 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇకపై హైదరాబాద్, బెంగళూరు, వంటి నగరాల్లో చికిత్స చేయించుకున్న  ఆరోగ్య శ్రీ పథకం కింద సాయం అందిస్తామని ప్రకటించారు. 

 

ఈ ఆరు నెలల్లో జగన్ ఎదుర్కొన్న విమర్శలు ఇవే:

 

అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నకు జగన్ సర్కార్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష టీడీపీ పట్టుబడుతోంది, ఈ నేపథ్యంలో అమరావతిని భ్రమరావతి గా చూపారని వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. నేటికీ అమరావతి పై ప్రజలకు సందేహాలు ఉన్నాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

 

ఇక జగన్ ను ఇరుకున పెట్టిన రెండో విషయం పోలవరం ప్రాజెక్ట్. పోలవరంలో అవినీతి జరిగిందంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని కేంద్రంకు చెప్పగా కేంద్రం సున్నితంగా తిరస్కరించింది. ఇక విద్యుత్తు పీపీఏలపై కూడా కేంద్రం రివర్స్ టెండరింగ్ కు నో చెప్పింది. ఇక ఇదే విషయంలో జగన్ కు కేంద్రానికి మధ్య దూరం పెరిగిందని గుసగుసలు వినపడుతున్నాయి. 

 

ఏపీ లో ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసాయి. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం అక్టోబర్ నెల వరకు వర్షాలు కురవడంతో ఇసుక లభ్యత ఇబ్బంది అయిందని త్వరలో పరిష్కారం చూపుతామని చెప్పింది. 

 

మొత్తానికి జగన్ తన ఆరు నెలల పాలన లో ఆంధ్రప్రదేశ్ ను సంక్షేమాంధ్రప్రదేశ్ చేశారు. సంక్షేమ పథకాల్లో తన తండ్రి వైఎస్ ను గుర్తు తెచ్చిన యువ నేత అదేవిధంగా అభివృద్ధి లోను పురోగతి సాధిస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జగన్ ఆరు నెలల పాలనపై మీ కామెంట్స్ ను తెలపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: