తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల అంశం విషయంలో నాలుగునెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇన్ని రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ విషయం కొలిక్కి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ను కొనసాగించేందుకు హైకోర్టు దాదాపు 67 మున్సిపాల్టీలపై గతంలో విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తేసి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం శుక్రవారం తాజా ఆదేశాలను జారీచేసింది.

 

 

వార్డుల విభజన, ఓటర్ల జాబితాలు, వార్డుల్లో జనాభాపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన పిటిషన్లను అంగీకరించిన ధర్మాసనం, జూలై 7న ముందస్తు ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. తాజాగా అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారానికి 14 రోజుల గడువు ఇచ్చింది.. ఇకపోతే 67 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ముందస్తు ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 74 పిటిషన్లు దాఖలైన విషయం విదితమే..

 

 

ఇదేకాకుండా ఈ ఎన్నికల విషయంలో అధికారుల తప్పిదాలకు, నిర్లక్ష్యానికి అమాయక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితాలో పొరపాట్ల అంశం చర్చకు వచ్చినప్పుడు.. ఉన్న పేర్లను ఉన్నట్లు ఎక్కించడంలో కూడా అధికారులు పొరపాట్లు చేస్తున్నారని ఆక్షేపించింది.

 

 

రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలు, రైతులపట్ల అధికారుల ప్రవర్తన సరిగా ఉండటంలేదని, ప్రజల ఫిర్యాదులను పట్టించుకొని సరైన సమాధానం చెప్పే పరిస్థితిలేదని, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో వస్తున్న తప్పులవల్ల రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, కార్యాలయాల వద్ద పరిష్కారం కాకపోవడం వల్ల హైకోర్టులో కేసులు పెరుగుతున్నాయని  వ్యాఖ్యానించింది...

 

 

ఇకనుండి  మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో అవినీతికి తావు లేకుండా చట్టప్రకారం సజావుగా నిర్వహించేలా అధికారులకు సూచించాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె. రామచంద్ర రావుకు న్యాయమూర్తి ఈ సందర్భంగా సూచించారు. ఆయా మున్సిపాల్టీల కమిషనర్లు శుక్రవారం నుంచి ఏడురోజులపాటు అభ్యంతరాలు స్వీకరించాలని, మరో ఏడురోజులు వాటిని పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాలని హైకోర్టు తెలిపింది.

 

 

జీవో నంబర్ 78 రూల్ 8 ప్రకారం అభ్యంతరాలను పరిష్కరించాలని, పరిష్కరించకపోతే కారణాలను లిఖితపూర్వకంగా వెల్లడించాలని పేర్కొన్నది. పూర్తి ప్రక్రియను చట్టానికి, జీవోల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: