ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటితో ఆరు నెలల పాలనను పూర్తి చేసుకున్నారు. ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని ప్రమాణం చేసి ఆ దిశగా ముందుకెళ్తున్నారు. వృద్థాప్య పెన్షన్ ను 2000 నుంచి 2250 కి పెంచుతూ తొలి సంతకం చేసిన నాటి నుంచి ఆయన తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

 

గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు కలిపి 4లక్షల ఉద్యోగాను భర్తీ చేశారు. దశలవారీగా మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు. బెల్టు షాపులు తగ్గించారు. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. అవినీతిని నిర్మూలించటం కోసం.. అవినీతిపై ఫిర్యాదుల కోసం 14400 నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, అమ్మఒడి, ఆటో డ్రైవర్లకు నగదు సాయం, మత్యకారులకు మేలు.. వంటివి చేశారు. వచ్చే ఉగాదిలోపు పేద కుటుంబాకు 25లక్షల ఇళ్లు అందించేలా కసరత్తు ప్రారంభించారు. 

 

 

జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంచలనమయ్యాయి. ప్రజావేదిక కూల్చివేత, రివర్స్ టెండరింగ్ విధానం సంచలనం సృష్టించాయి. అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజధానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కేంద్రం వారించినా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాయి. స్థానికులకే 75శాతం ఉద్యోగాల అంశంపై వివాదాలు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న మన రాష్ట్రం వారి పరిస్థితేంటనే వాదనలు వచ్చాయి.

 

 

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై కేసీఆర్ ప్రతిపాదనను అంగీకరించడం సరికాదనే విపక్షాల ఆరోపణలు, నీటి పారుదల రంగ నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంపై విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలపై మంత్రుల వ్యాఖ్యలు, పంచాయతీ ఆఫీసులు, స్మశానాలు.. ఇలా ప్రతిదానికి వైసీపీ జెండా రంగులు వేసి విమర్శలకు గురవుతున్నారు. 

 

 

వైఎస్ తరహాలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన జగన్ వాటికి నిధులు సమీకరించాల్సి ఉంది. ఆర్ధిక మాంద్యం కారణంగా కేంద్రం నుంచి కూడా నిధులు తక్కువగా అందే పరిస్థితి. అప్పులు చేయడం, ప్రభుత్వ భూముల అమ్మకం మంచిది కాదని ఆర్ధికవేత్తల మాట. దీనిపై విపక్షాలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ముందుకు సాగితే జగన్ మంచి సీఎంగా చిరకాలం గుర్తుండిపోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: