యువ పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. యువత భారీ ఎత్తున ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో ఆందోళన చేపట్టారు. 
 
ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని యువత డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రియాంక రెడ్డి ఉదంతంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజాసంఘాలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకొని నిరసనలు తెలిపాయి. ప్రియాంక తల్లి విజయమ్మ నిందితులను సజీవంగా తగులబెట్టాలని డిమాండ్ చేశారు. 
 
తన పెద్ద కుమార్తెను అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని ప్రియాంకకు లోకం పోకడ తెలియదని విజయమ్మ అన్నారు. పోలీసులు తాము ఫిర్యాదు చేయటానికి వెళ్లినపుడు సరిగా స్పందించలేదని ప్రియాంక తల్లి ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో పోలీసులు అభ్యంతరకర ప్రశ్నలు వేశారని విజయమ్మ చెప్పారు. ప్రియాంక నివశించే శంషాబాద్ నక్షత్ర కాలనీ వాసులు ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు కారణమైన నిందితులను తమకు అప్పగిస్తే నరకం చూపిస్తామని చెబుతున్నారు. 
 
నక్షత్ర కాలనీ వాసులు నలుగురు నేరస్థులను ఎన్ కౌంటర్ చేసి చంపాలని కోరారు. నిందితులలో ఒకరైన చెన్నకేశవులు తల్లి తన కొడుకును ఉరి తీసినా పరవాలేదని వ్యాఖ్యలు చేశారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో నిందితులు ప్రియాంక మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. సీపీ సజ్జనార్ పోలీసులపై వస్తున్న ఆరోపణలలో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపిస్తామని అన్నారు. ఈ కేసులో ఐదవ నిందితుడు ఉన్నాడని వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: