త‌మ‌తో పొత్తు పెట్టుకొని..మ‌ద్ద‌తు ఇచ్చే నేత‌గానే మిగిలిన శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ద‌వ్ ఠాక్రేను సీఎంగా చేసిన (!) బీజేపీ మ‌ళ్లీ ఆయ‌న‌కు ఆ కుర్చీలో ప‌దిలంగా కూర్చునే చాన్సిచ్చింది.  శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ‘మహా వికాస కూటమి’ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి) సర్కార్‌ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కుంది. మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జ‌రిగిన బ‌ల‌ప‌రీక్షలో ఉద్ద‌వ్ ఠాక్రే నెగ్గారు. కాంగ్రెస్ నేత అశోక్ చ‌వాన్ ఇవాళ స‌భ‌లో విశ్వాస ప‌రీక్ష తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. బీజేపీ వాకౌట్ చేసిన త‌ర్వాత జ‌రిగిన ఓటింగ్‌లో ఉద్ద‌వ్ ప్ర‌భుత్వం నెగ్గింది. ఠాక్రే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా 169 ఓట్లు పోల‌య్యాయి.

 


ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.డిసెంబర్‌ 3లోగా మెజార్టీని నిరూపించుకోవాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం బలపరీక్షను ఎదుర్కున్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీకి 145 స్థానాలు అవసరం. తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని సంకీర్ణ ప్రభుత్వం చెప్పింది. తాజాగా జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో ఆ కూట‌మికి 169 ఓట్లు పోల‌య్యాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీజేపీ పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. అక్ర‌మంగా, రాజ్యాంగ వ్య‌తిరేకంగా స‌భ నిర్వ‌హిస్తున్నార‌ని మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీక‌ర్ నియామ‌కం అనైతికంగా జ‌రిగింద‌న్నారు.

 

ఎన్సీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ దిలీప్‌ వాల్సే పాటిల్‌ శుక్రవారం ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యారు.  ఆదివారం స్పీకర్‌ ఎన్నిక జరుగనుంది. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడుతారు. కొత్త స్పీకర్‌ ప్రతిపక్ష నేత పేరును ప్రకటిస్తారు. నేటి నుంచి  రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం కానుంది. తొలి రోజునే విశ్వాస పరీక్షను నిర్వహించారు.

కాగా, త‌మ ప్ర‌భుత్వం విష‌యంలో కేంద్రాన్ని ఇర‌కాటంలో  ప‌డేసేలా...శివ‌సేన అడుగులు వేస్తోంది. తన అధికారిక పత్రిక సామ్నాలో శివసేన ఈ మేరకు కీల‌క వ్యాఖ్యలు చేసింది.  ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సోదరభావంతో మెలుగాలని.. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన ‘తమ్ముడికి’ సహకరించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉన్నదని శివసేన పేర్కొంది. మహారాష్ట్ర ప్రజల తీర్పును కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని, రాష్ట్ర ప్రభుత్వ సుస్థిరతకు ప్రమాదం తలెత్తకుండా చూడాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: