వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులైన నలుగురు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, స్థానికులు, బంధువులు, ప్రియాంక రెడ్డి స్నేహితులు.. అందరూ పోలీస్ స్టేషన్ కి భారీగా చేరుకున్నారు. నిందితులను తక్షణమే ఉరి తీస్తారా లేదా.. మీ వల్ల కాకపోతే మాకు వదిలేయండి, మాకు అప్పగించండి మేం వాళ్ళ సంగతి చూసుకుంటాం అంటూ డిమాండ్లను చేయడం ప్రారంభించారు నిరసనకారులు. ఇలాంటి మృగాలు భూమి మీద అసలు ఒక్క క్షణం కూడా బ్రతకకూడదు అంటూ కోపోద్రిక్తులైన అక్కడి ప్రజలు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు.

దాంతో వారి ఆగ్రహానికి కట్టడం వేయడం పోలీసులకు క్లిష్టతరంగా మారింది. పోలీసులు కంట్రోల్ చేయలేక ఇక తప్పక వారిపై స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అయితే ఈ నలుగురు నిందితులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాల్సి ఉంది.. కానీ అక్కడి ప్రజలు ఆ నిందితులు బయటకు వస్తే క్షణాల్లోనే చంపేసేటట్టున్నారు. దాంతో చేసేదేమీ లేక వైద్య పరీక్షలు చేసే డాక్టర్ లనే పోలీస్ స్టేషన్ కి రప్పించారు. దీంతో వైద్యులు నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు పోలీస్ స్టేషన్ లో చేశారు.

ఇంకా వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కి వస్తూనే ఉన్నారు. పోలీసుల లాఠిచార్జ్ లకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి ఎలాగైనా నేరస్తుల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దాంతో పోలీసులు బాగా అప్రమత్తమయ్యారు. పోలీస్ స్టేషన్ గేటును మూసేశారు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో... దానికి బేడీలు వేశారు. పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ ఇచ్చిన ఈ నిందితులను రిమాండ్‌కు తరలిస్తారా లేక షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచుతారా అనేది తెలియనున్నది.




మరింత సమాచారం తెలుసుకోండి: