ప్రియాంక ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్‌ సెలబ్రిటీలు. ప్రియాంకరెడ్డి హత్య తమను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలు నాని, అల్లరి నరేశ్‌, అల్లు శిరీశ్‌, సుధీర్‌బాబు, వివి వినాయక్‌, కీర్తి సురేశ్‌, మెహ్రీన్ పిర్జాదా‌, లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, స్మిత తదితరులు ట్విటర్‌ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

 

పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయావుతున్నాయని, ప్రియాంకరెడ్డి హత్య తెలియగానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదని హీరో నాని ట్వీట్‌ చేశారు. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లిన మహిళలు సురక్షితంగా తిరిగివచ్చే పరిస్థితులు దేశంలో ఎప్పుడొస్తాయంటూ ప్రశ్నించారు. తాను కర్మను నమ్ముతానని, అది ఎల్లవేళలా పనిచేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా. ప్రియాంక హత్య గురించి తెలియగానే గుండె పగిలినంతపనైందని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

 

ఒక అమ్మాయిని ఇంత కిరాతంగా​ చంపుతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి. హత్య వార్త గురించి తెలియగానే షాక్‌కు గురయ్యానని మరో హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా పేర్కొన్నారు. ప్రియాంకరెడ్డి తన చెల్లితో మాట్లాడిన చివరి ఫోన్‌కాల్‌ హృదయాన్ని మెలిపెట్టేలా ఉందని హీరోయిన్‌ దివ్యాంషా కౌశిక్‌ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో యువతులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. చాలా బాధాకరం. ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు  నేర్పించాలని.. దీంతోనే వచ్చే తరాన్ని కాపాడుకోవాలంటూ ప్రముఖ గాయని స్మిత ట్వీట్‌ చేశారు.

 

ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం, కిరాతం వంటి మాటలు కూడా సరిపోవని హీరో అల్లరి నరేశ్‌, సుధీర్‌బాబులు ఆవేదన వ్యక్తం చేశారు. లైవ్‌ లొకేషన్‌ యాప్స్‌, అత్యవసర ఫోన్‌ కాల్‌ ఆ​ప్షన్స్‌ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలన్నారు దర్శకుడు వివి వినాయక్‌. ప్రియాంక హత్య గురించి తెలియగానే తనకు బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయని హీరో అల్లు శిరీష్‌ పేర్కొన్నారు. సంతాపంతో సోషల్ మీడియా అంతా.. ప్రియాంక రెడ్డి ఫోటోలే దర్శనమిస్తున్నాయి. డాక్టర్ కుటుంబానికి సంతాపం తెలపుతున్న హ్యాష్ ట్యాగ్‌తో పాటు  నిందితులను చంపేయాలనే హ్యగ్‌ ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: