వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హ‌త్య ఉదంతంలో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. నిందితుల‌కు శిక్ష వేసే ఉదంతం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురాగా ఉద్రిక్తత నెలకొంది. నిందితుల‌ను ఉరితీయాలంటూ స్థానికులు ఆందోళన చేశారు. భారీ సంఖ్యలో ప్రజా సంఘాలు, స్థానికులు అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర ఆందోళ‌నలో కొంద‌రు పోలీసుల వైపు, పోలీస్ స్టేష‌న్ వైపు చెప్పులు విసరడం క‌ల‌క‌లం రేకెత్తించింది. అనంత‌రం ఉద్రిక్త‌త మ‌ధ్య వారిని చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌రలించారు. 

 

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులను విచార‌ణ చేప‌ట్టి క‌స్ట‌డీకి త‌ర‌లించేందుకు పోలీసులు సిద్ధ‌మ‌య్యారు. అయితే, నిందితులను తమకు అప్పగించాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు పీఎస్ ముందు నిరసన దిగారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 5 గంటలకు పైగా పీఎస్ దగ్గరే బైఠాయించారు ప్రజలు.. నిందితులను తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వెనక్కి తగ్గడంలేదు. క్షణక్షణానికి జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఇదే స‌మ‌యంలో నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించే వీలులేకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దకే వైద్యులను రప్పించి పరీక్షలు నిర్వహించారు. పీఎస్‌లోనే మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పాండు నాయక్ నిందితులను విచారించారు. నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. 

అనంత‌రం  జైలుకు తరలించే క్రమంలో ఆందోళనకారులు పోలీసు వాహనాలకు అడ్డు తగిలారు. నిందితులను తీసుకెళ్తున్న వాహనాలపై నిరసనకారులు రాళ్లు, చెప్పులను విసిరారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు తరలించారు. నిందితుల‌ను చ‌ర్ల‌పల్లి జైలుకు త‌ర‌లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: