ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించి ఆరునెలలైంది. ఈ ఆరు నెలలలో సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టటంతో పాటు ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో ఘనవిజయం సాధించిన వైసీపీ పార్టీ ప్రజల నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయలేదు. ఆరు నెలల జగన్ పరిపాలనపై మెజారిటీ శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ ఆరు నెలలలో సీఎం జగన్ నవరత్నాలకు అధికంగా ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేందుకు సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం వలన చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే ఇలాంటి సమయంలో సీఎం జగన్ 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారు. 
 
దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తూ బెల్ట్ షాపులను రద్దు చేసి మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో సీఎం జగన్ ఉద్యోగాలను కల్పించడం పట్ల, మద్యపాన నిషేధం అమలు చేయడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రివర్స్ టెండరింగ్, అగ్రిగోల్డ్ బాధితులకు సాయం చేయడం, ఆశ.. అంగన్ వాడీ, పారిశుద్ధ్య కార్మికులు, వీఓఏలకు జీతాలు పెంచటం, రైతు భరోసా, కంటి వెలుగు కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తమవుతోంది
 
ఇసుక కొరత, రాజధాని మారుతుందని కొందరు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, రాజధాని నిర్మాణం నిలిపివేయటం, అన్న క్యాంటీన్ల మూసివేత, తెలుగు మీడియంను పూర్తిగా తొలగించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టటంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇసుక కొరత సమస్య ప్రస్తుతం తీరినా గడచిన ఐదు నెలలు ప్రజలు ఇసుక కొరత వలన పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆరు నెలల పరిపాలన మాత్రమే కావటంతో జగన్ పరిపాలన గురించి ఇప్పుడే చెప్పలేమని కానీ చంద్రబాబు పరిపాలనతో పోలిస్తే జగన్ ఎన్నో రెట్లు మేలని ప్రజలు చెప్పటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: