సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. నేటికి ఆరు నెలలు పూర్తయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే..జగన్ చేసిన తొలి ప్రసంగం లో..ఆరు నెలల్లోనే మా తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కంటే గొప్ప ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను.  నవరత్నాల హామీతో.. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్.. ఆరు నెలల్లోనే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని మాటిచ్చారు. గతంలో ఏ మాత్రం పాలన అనుభవం లేని ఆయన.. ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రాన్ని ఏరకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.  

 

ప్రతిపక్ష నేతలు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో నేను విన్నాను.. నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాట నెలబెట్టుకుంటున్నారని ఇప్పటికే ప్రజల్లో అభిప్రాయం వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీల పరంగా మాత్రం ముఖ్యమంత్రి చన్నపాటి సర్దుబాట్లతో మాట మీద నిలబడ్డారు. తొలి ఆరు నెల్లోనే అనేక హామీలను అమల్లోకి తీసుకురాగా.. మరి కొన్నింటికి అమలు చేసే తేదీలను ప్రకటించారు. అదే సమయంలో రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్.. సీపీఎఫ్ రద్దు దిశగా నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

 

విద్య, ఆరోగ్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. బినెట్ లో తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గించి...బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ..కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారు. అదే విధంగా పారిశుద్ద కార్మికులు..ఆశా వర్కర్లు..అంగన్ వాడీ సిబ్బంది వంటి వారికి జీతాలు పెంచారు. సీపీఎస్ అమలు పైన కమిటీ నియమించారు. ఆటో డ్రైవర్లకు పది వేలు చొప్పున అందించారు. అదే విధంగా అగ్రి గోల్డ్ బాధితులకు సాయం అందచేసారు.

 

దశలవారీగా మద్యపానం నిషేధం దిశగా అడగులేస్తున్న జగన్.. బెల్ట్ షాపులను రద్దు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తూ.. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఆదాయం కంటే ప్రజారోగ్యమే తన ప్రాధాన్యమని జగన్ చెబుతున్నారు.  మొత్తానికి ఆరు నెలల్లో తనదైన మార్కు చాటుకున్న సీఎం జగన్ ముందు ముందు బంగారు పాలన అందిస్తారని వైసీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: