ఏపీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఈరోజుతో ఆరు నెలలు పూర్తయింది. సీఎం జగన్ ప్రమాణ స్వీకార వేదికపై ఆరు నెలల సమయం ఇస్తే మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి సీఎం జగన్ నవరత్నాల అమలుతో పాటు 4 లక్షల వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల కల్పనతో దూసుకుపోతున్నారు. అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఫించన్లను పెంపుకు ఆమోదం తెలిపారు. 
 
హోంగార్డుల జీతాలు, ఆశా వర్కర్ల జీతాలు, వీఏఓల జీతాలు, అంగన్ వాడీ వర్కర్ల జీతాలు పెంచారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయటంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. మద్యపాన నిషేధం దిశగా కీలక అడుగులు వేయడంతో పాటు పేద పిల్లలు ఇంగ్లీష్ చదివేలా నిర్ణయం తీసుకోవడంపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో అవినీతి తగ్గటం గమనార్హం. 
 
జగన్ ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం వలన ప్రజల సమస్యలు సులభంగా పరిష్కారం అవుతున్నాయి. సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ప్రజలనుండి, ప్రతిపక్షాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేయడం, రైతు భరోసాను మూడు విడతలుగా ఇవ్వటంపై రైతుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. 
 
సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని సీఎం ప్రకటించినా కమిటీల మీద కమిటీలు వేస్తూ ఉండటం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదట్లో సన్న బియ్యం ఇస్తామని ప్రకటించి ఆ తరువాత నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పటం, అన్న క్యాంటీన్ లను మూసివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మంత్రుల మాట తీరు, పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడం ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తెచ్చింది. మెజారిటీ ప్రజల్లో మాత్రం సీఎం జగన్ పరిపాలనపై సంతృప్తి వ్యక్తమవుతోంది. కొంత ఆలస్యం అయినా పథకాలను అమలు చేయాలనే ధృడ సంకల్పం మాత్రం జగన్ లో కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: