దేశంలో రైల్వేస్ , ఎల్ఐసి, ఎస్‌బీఐ నమ్మదగిన సంస్థలు. ఇవే కనుక మోసాలు చేస్తే ఇక సగటు భారత పౌరుడు నమ్మకం కోల్పోతాడు. అలంటి దేశీయ అతి పెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు ఇది కచ్చితంగా షాకింగ్‌ న్యూస్‌. ఎస్‌బీఐ ఖాతాల్లోని డబ్బులు అనూహ‍్యంగా మాయమైపోతున్నాయన్న వార్తలు కలకలం సృష్టిసుతున్నాయి. నకిలీ  చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీంతో స్వయంగా ఎస్‌బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. పెద్దమొత్తంలో ఉన్న నాన్‌ హోం చెక్కుల క్లియరింగ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ కు చెందిన ఎస్‌బీఐ రెండు ఖాతాల్లోని  రూ. 12 కోట్లకు పైగా సొమ్ము మాయం అయింది. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి రూ .7 కోట్లు,  రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్‌కు చెందిన మరో ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా తరలిపోయాయి. అధీకృత సంతకాలులేని నకిలీ చెక్కుల చెల్లింపులకు ఆయా శాఖలే వైఫల్యానికి కారణమని ఎయిమ్స్‌ వాదించింది.

 

దీనికి సంబంధించి ఒక నివేదికను  కూడా  ఆరోగ్య మంత్రిత్వ శాఖకు  సమర్పించింది.  ఈ మోసం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా, గత వారం డెహ్రాడూన్ (రూ .20 కోట్లకు పైగా)‌, ముంబైలో ఎస్‌బీఐ నాన్-హోమ్ బ్రాంచుల నుండి (రూ .9 కోట్లు) క్లోన్ చెక్కుల ద్వారా రూ .29 కోట్లకు పైగా నగదును అక్రమంగా ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరిగాయని  తెలిపారు.

 

ఆర్బీఐ నుంచి వచ్చిన బ్యాంకు సూచనల మేరకు ఏదైనా నాన్-హోమ్ బ్రాంచ్‌లో నుంచి రూ. 2 లక్షలకుపైగా విలువైన చెక్‌ వస్తే.. చెక్కును క్లియర్ చేయడానికి ముందు ధృవీకరణ కోసం కస్టమర్‌ను సంప్రదించాలని ఎస్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: