ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జార్ఖండ్ లో మొత్తం 82 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 13 నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం 62.87గా నమోదైంది. భావనాథ్ పూర్, గర్హా, హుస్సైనాబాద్, ఛత్తర్ పూర్, బిశ్రామ్ పూర్, డాల్టన్ గంజ్, పాంకీ, లతేహార్, మనిక, లోహార్డగ, బిషన్ పూర్, గుమ్లా, ఛాత్ర నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 
 
ఈ 13 నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడం గమనార్హం. ఈ 13 నియోజకవర్గాల్లో భావనాథ్ పూర్ నియోజకవర్గం నుండి 29 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 13 నియోజకవర్గాల్లో మొత్తం 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల కోసం 3,906 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా 989 పోలింగ్ కేంద్రాలకు వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించింది. 
 
డిసెంబర్ 23వ తేదీన జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా మొత్తం 5 విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ లో జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి రామ చంద్ర వంశీ, మాజీ ఐపీఎస్ అధికారి రామేశ్వర్ ఓరాన్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు, 136 కోట్ల రూపాయల మెడికల్ స్కామ్ నిందితుడు భాను ప్రసాద్ షాహి, ఇతర ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నవంబర్ 1వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఐదు విడతలుగా జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలకు వేరు వేరు తేదీలలో నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ తేదీలు, నామినేషన్ల విత్ డ్రా ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలలో మధ్యాహ్నం 3.30 గంటలకే పోలింగ్ ముగిసింది. 189 మంది అభ్యర్థుల్లో 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రెండో విడత పోలింగ్ డిసెంబర్ 7వ తేదీన జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: