ఒకేరోజులో జ‌రిగిన రెండు దారుణ హ‌త్య‌లు తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేకెత్తించాయి. తెలంగాణలో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ న‌గ‌రాలుగా పేరొందిన హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌లో దారుణం చోటు చేసుకుంది. వ‌రంగ‌ల్‌లో మాన‌స అనే విద్యార్థిని హ‌త్య‌, హైద‌రాబాద్‌లో వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ప్రియాంక‌రెడ్డి దారుణ హ‌త్య క‌ల‌క‌లం రేకెత్తించింది. దేశ‌వ్యాప్తంగా ప్రియాంక‌రెడ్డి మ‌ర‌ణం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇలాంటి త‌రుణంలో...ఓ లెక్చ‌రర్ పోలీసు శాఖ‌కు సంచ‌ల‌న ద‌ర‌ఖాస్తు చేశారు. త‌న‌కు రివాల్వ‌ర్ అనుమ‌తి ఇవ్వాల‌ని ఆమె కోరారు. రివాల్వ‌ర్ లైసెన్స్ ఇప్పిస్తారా...ఒక‌వేళ ఇప్పించ‌లేక‌పోతే ప్ర‌భుత్వ ఉద్యోగం మానేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని పోలీసుల‌కు ఆమె స్ప‌ష్టం చేసింది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఈ మేర‌కు నౌషీన్‌ ఫాతిమా అనే లెక్చ‌ర‌ర్ సంచ‌ల‌న విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

 


నౌషీన్ లేఖ ఇలా సాగింది. 
``శ్రీ డాక్టర్‌ విశ్వనాథ్ రవిందర్‌ గారు,
కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌

విషయం : The Arms Act 1965 and Rules ప్రకారం ఆత్మరక్షణకు రివాల్వర్‌ లైసెన్స్‌ మంజూరుకు 

విజ్ఞప్తి.

సర్‌..మహిళలపై హింసకు సంబంధించి ఇటీవలే నా చుట్టూ జరుగుతున్నపరిణామాలు నన్ను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేసుకుంటున్న నాకు బయటికి వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఉద్యోగం కోసం నేను ప్రతిరోజు వరంగల్ నుంచి ఖమ్మంకు ఒంటరిగా ప్రయాణిస్తాను. తెల్లవారుజాము ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుంది. ఈనెల 28న మానస హత్య జరిగిన ప్రాంతం హంటర్‌ రోడ్‌ లోని విష్ణు ప్రియ గార్డెన్  ప్రాంతం మా ఇంటి సమీపంలోనే ఉంది. నేను ప్రతిరోజు అదే మార్గంలో ప్రయాణిస్తాను. ఆ వార్త చదివిన అప్పటినుంచి నేను ఇంటికి సురక్షితంగా వస్తానా అన్న భయం ప్రతిరోజు వెంటాడుతోంది. హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి, వరంగల్‌లో మానసకు జరిగింది రేపు ఎవరికైనా, ఎప్పుడైనా జరగొచ్చు. అత్యవసర పరినితుల్లో 100కు ఫోన్‌చేసినా, మొబైల్‌ ఆప్‌ ద్వారా తక్షణ సహకారం కోరిన వెంటనే క్షణాల్లో ప్రత్యక్షమై పోలీసులు రక్షిస్తారు అని నేను నమ్మడం లేదు. పోలీసు శాఖపై నమ్మకం లేక ఇలా చెప్పటం లేదు. ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి కాపాడడం అనేది... పోలీసింగ్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాలుగా పేరుగాంచిన ఇంగ్లాండ్‌, కెనడా, నెదర్లాండ్స్‌ దేశాల్లోనే పాధ్యం కావడం లేదు. అలాంటప్పుడు వరంగల్లో సాధ్యం అవుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఆపదలో నన్ను నేను కాపాదుకోలేనప్పుడు నా ఉన్నత చదువులకు, రాజ్యాంగం ప్రసాందించిన జీవించే హక్కుకు ఇక విలువ ఏముంటుంది..?  మానవ మృగాల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్‌ కలిగి ఉండటమే ఏకైక సురక్షిత మార్గం అని నేను నమ్ముతున్నాను. మీరు రివాల్వర్‌ లైసెన్స్‌ నిరాకరిస్తే...సురక్షితంగా ఉండాలంటే ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో. దయచేసి నా ఆత్మ రక్షణ కోసం The Arms Act 1965 
and Rules ప్రకారం నాకు రివాల్వర్‌ లైనెన్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇట్లు
నౌషీన్‌ ఫాతిమా, ఎంసీఏ, ఎంటెక్‌
లెక్చరర్‌, ట్రైబల్‌ వెలే సర్‌ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌``

లెక్చ‌ర‌ర్ సంచ‌ల‌న విజ్ఞ‌ప్తికి పోలీసు విభాగం ఎలా స్పందిస్తుండో వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: