ఇటీవల సినిమా రంగంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు గా ఓ వెలుగు వెలిగిన వారంతా రాజకీయాల వైపు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడులో స్టార్ హీరోలుగా ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్, మ‌రో దిగ్గ‌జ హీరో కమలహాసన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు. కమలహాసన్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయగా... మరోవైపు ర‌జ‌నీకాంత్‌ సైతం సొంతంగా పార్టీ పెడతారా ? లేదా ఏదో ఒక జాతీయ పార్టీలో చేరతారా ? అన్న దానిపై క్లారిటీ లేదు.

 

ఇక హీరోయిన్లుగా ఉన్నవారిలో ఇలాంటి వాళ్లు ఇప్పటికే అక్కడ యాక్టివ్‌గా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు రేష్మా రాథోడ్, మాధవీ లత‌ లాంటివాళ్ళు బీజేపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు మరికొందరు హీరోయిన్లు కూడా బిజెపి వైపు ఆకర్షితులు అవుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోజురోజుకు బలోపేతం అవుతుండడంతో ఎక్కువమంది బిజెపి వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

 

ఈ క్ర‌మంలోనే హీరోయిన్ నమిత బీజేపీలో చేరారు. కొద్ది రోజులుగా న‌మిత పొలిటిక‌ల్ ఎంట్రీపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆమె బీజేపీకి స‌పోర్ట‌ర్‌గా మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్య‌లు నిజం చేస్తూ ఆమె బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో శనివారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మరింత కొంత మంది కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. న‌మిత‌తో పాటు ఆమె భ‌ర్త కూడా పార్టీలో చేరారు.

 

కాగా నమిత దక్షిణాదిన పలు భాషల్లో నటించిన విషయం తెలిసిందే. ఆమె తెలుగులో ఆర్య‌న్ రాజేష్ హీరోగా వ‌చ్చిన సొంతం సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. బాల‌య్య సింహా సినిమాతో ఆమె బాగా పాపుల‌ర్ అయ్యారు. గతకొంత కాలంగా సినిమాల్లో అవకాశం లేకపోవడంతో రాజకీయాల వైపు అడుగులు వేసింది. తమిళనాడులో బీజేపీ తరఫున రానున్న అసెం‍బ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: