ప్రియాంక రెడ్డి హత్య కేసులో టిఐడి కీలకంగా మారనుంది. ఆధారాలను వీలైనంత చెరిపేయటానికి నిందితులు ప్రయత్నించటంతో, సాక్షులు వీరిని గుర్తించటానికి పెరేడ్ నిర్వహించే అవకాశాలున్నాయి. డెజిగ్నేటెడ్ న్యాయమూర్తి సమక్షంలో ఈ పెరేడ్  జైల్లో నిర్వహిస్తారు.


ప్రియాంకరెడ్డి కేసులో నిందితులకు శిక్ష పడాలంటే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కీలకంగా మారనుంది. నిజానికి ఎక్కడా బలమైన ఆధారాలు దొరక్కుండా నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కానీ, మిగిలిన కొన్ని భౌతిక సాక్ష్యాలు, సీసీ కెమెరాల్లో నమోదైన విజువల్స్‌,  టీఐడీ పరేడ్ కీలకంగా కానున్నాయి.  డిజిగ్నేటెడ్ న్యాయమూర్తి సమక్షంలో ఈ పరేడ్ జరుగుతుంది. నిందితులు మృతదేహాన్ని కాల్చడానికి పెట్రోల్ కోసం రెండు బంకుల వద్దకు వెళ్లారు. వాటి యజమానులు లేదా వర్కర్లు, ఇతరుల్లో కొందరు వీరిని కచ్చితంగా చూసే ఉంటారు. వీరందరూ కేసులో సాక్షులుగా మారనున్నారు. న్యాయస్థానంలో వీరందరి సాక్ష్యం కీలకంగా మారనుంది.


కేసును విచారిస్తున్న న్యాయస్థానం నియమించే మరో న్యాయయూర్తి సమక్షంలో ఈ టీఐడీ పరేడ్ జైల్లోనే జరుగుతుంది. ఆ రోజు ఈ కేసులోని సాక్షులంతా న్యాయమూర్తి ఎదుట నిందితులను గుర్తించాల్సి ఉంటుంది. నేరానికి సన్నాహాలు జరుగుతున్నప్పుడు తాము చూసింది వీరినేనని వాంగ్మూలం ఇవ్వాలి. నిందితులను దోషులుగా నిరూపించడానికి ఇది ఎంతో కీలకం. 

 

ఈ పరేడ్ నిర్వహించాల్సి ఉన్న కారణంగానే శుక్రవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. వారి ఫొటోలను సైతం ముఖాలపై ముసుగుతోనే చూపించారు. దోపిడీ, బందిపోటు దొంగతనంతో పాటు కొన్ని రకాలైన హత్య, ఉగ్రవాద చర్యల్లోనూ టీఐడీ పరేడ్ కీలకంగా మారుతుంది. అందుకే ఈ తరహా కేసుల్లో టీఐడీ పరేడ్ పూర్తయ్యే వరకు నిందితుల ఫొటోలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడతారు.

 

టీఐడీ పరేడ్‌ ను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ లోని సెక్షన్ 9ను అనుసరించి చేపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే... న్యాయమూర్తి సమక్షంలో నిందితుణ్ని సాక్షులు లేదా బాధితులు గుర్తించడమే. సాధారణంగా అత్యాచారం, దోపిడీ, బందిపోటు దొంగతనం, కొన్ని హత్యలు, ఉగ్రవాద చర్యల్లో పోలీసులు టీఐడీ పరేడ్ నిర్వహణకు న్యాయస్థానం అనుమతి కోరతారు. కేసును విచారిస్తున్న న్యాయస్థానం న్యాయమూర్తి దీన్ని నిర్వహించరు. అందుకే ఆయన మరో న్యాయమూర్తిని డిజిగ్నేట్ చేస్తారు. 

 

ఈ పరేడ్ ను జైలులోనే జరుపుతారు. సాక్షులకు సమన్లు ఇచ్చి పిలిచించడం ద్వారా నిర్వహిస్తారు. రాష్ట్రంలోని జైళ్లలో కేవలం శనివారం మాత్రమే టీఐడీ పరేడ్లు జరుగుతున్నాయి. దీనికి ఏర్పాటు చేయాల్సిందిగా ముందుగా జైలు అధికారులకు లేఖ రాయాల్సి ఉంటుంది. అయితే, టీఐడీ పరేడ్ లో  నిందితుడిని గుర్తించడానికి కొన్ని ప్రమాణాలున్నాయి. నిందితుడి దేహ దారుఢ్యం, అదే పోలికలు, వయసులో ఉన్న దాదాపు ఆరు నుంచి పది మందిని ఎంపిక చేస్తారు. వీరి మధ్యలో నిందితుడిని ఉంచిన న్యాయమూర్తి సాక్షులను పిలిచి గుర్తించమని కోరతారు. ఇలా నిందితుడి స్థానాన్ని రెండు మూడుసార్లు మార్చి మళ్లీ గుర్తించమంటారు. అయితే టీఐడీ పరేడ్ నిర్వహణకు ముందు నిందితుడిని సాక్షి చూడలేదని న్యాయస్థానానికి స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. అందుకే, కొన్ని కేసుల్లో అరెస్టు చూపించే సందర్భంలో పోలీసులు నిందితుల ముఖానికి ముసుగు వేస్తారు. ఈ తంతు పూర్తయ్యే వరకు అతని ఫోటో బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. పరేడ్ లో పాల్గొనే సాక్షికి ముసుగు వేయడం ద్వారా వారిని నిందితుడు గుర్తించకుండా జాగ్రత్త పడతారు. నిందితుడిగా పబ్లిక్ ఫిగర్, సెలబ్రెటీ ఉంటే, ఈ పెరేడ్‌ నిర్వహించరు.

మరింత సమాచారం తెలుసుకోండి: