నిస్సహాయ నిర్భయ.. అసహాయ అభయ.. నాడు దేశ రాజధాని.. నేడు రాష్ట్ర రాజధాని.. అప్పుడూ ఇప్పుడూ అదే దారుణం.. అక్కడా ఇక్కడా ఇంటికి చేరే ప్రయత్నంలో ఉన్న యువతే బలయింది. అక్కడ బస్సు కేంద్రంగా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తే, ఇక్కడ లారీని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరించారు. 


డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య..ఉదంతం యావత్ ప్రజానీకాన్ని కదిలించింది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో అతి దారుణంగా హత్యకు గురైంది వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి. మృతురాలిని కిరాతకులు చిత్రహింసలు పెట్టి ఉంటారనే అనుమానం అందరిలో అలజడి రేపుతోంది. ఈ కేసులో నిందితులను పోలీసులు చాలా త్వరగా గుర్తించారు.  లారీ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకోగలిగారు. దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం..మరోమారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసుగా ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యకేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. సరిగ్గా మీసాలు కూడా రాని.. నలుగురు కుర్రాళ్లు ఓ ఆడపిల్లను ఇంత భయంకరంగా చంపేశారని విన్న ప్రతి ఒక్కరికి ఒళ్లు జలదరిస్తోంది. 

 

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకపై జరిగిన ఘోర అత్యాచారం, హత్య సంఘటన ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచారం ఘటనను గుర్తు చేస్తోంది. రెండు సంఘటనలూ మహిళలకు కొరవడిన భద్రతపై దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చాయి. ఈ రెండు ఘటనలకు అనేక పోలికలున్నాయి. ఆ ఘటనలో ఇందులో బస్సు డ్రైవర్, క్లీనర్, స్నేహితులు నిందితులు. బస్సు ఎక్కుదువురా అక్కా అంటూ పిలిచి మరీ, నిర్భయను అత్యంత కిరాతకంగా హింసించారు. ఢిల్లీలో మిత్రుడితో కలిసి సినిమాకు వెళ్లి తిరిగివస్తూ కీచకుల కోరల్లో చిక్కింది. నిర్భయ ఘటన 2012 డిసెంబరు 16న ఆదివారం రాత్రి 9.30కి జరిగింది.  నిర్భయ ఘటనకు వేదిక వాహనం. కదులుతున్న బస్సులో అత్యాచారం చేశారు. నేరస్థులంతా ఒకచోట జమ కావడానికి బస్సు కారణం.


బైకుకు పంక్చరు వేయిస్తానంటూ 20 ఏళ్ల క్లీనర్, డాక్టర్ను మాటల్లో పెట్టి ఉచ్చులోకి లాగాడు. పాశవికంగా లైంగిక దాడి చేసి, డాక్టర్ను అత్యంత భయానకంగా తగలబెట్టారు. హైదరాబాద్లో వైద్యుడి అపాయింట్ మెంట్ కోసం గచ్చిబౌలి వెళ్లి ఇంటికి వచ్చేందుకు సిద్ధమై.. మాటేసిన వారి చేతిలో బలైంది నేటి నిర్భ ప్రియాంక. ఈ  ఘటన 2019 నవంబరు 27 బుధవారం రాత్రి 9.30  తర్వాత జరిగింది. ఇదీ చలికాలమే.
వెటర్నరీ డాక్టర్  ప్రియాంక ఘటనకు వేదిక లారీ. లారీ చాటున ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. లారీలోనే శవాన్ని తరలించారు. నలుగురు నేరగాళ్లు జమ కావడానికి ఇక్కడ ఓ లారీ కారణం. 

 

2012డిసెంబర్ లో ఢిల్లీలో స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తున్న ఫిజియోథెరపిస్ట్ జ్యోతిసింగ్ ని, కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఇనప కడ్డీలతో కొట్టి మరీ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 29 డిసెంబర్ 2012 న ఆమె మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అయితే సమాజంలో మాత్రం మార్పు రాలేదు. ఒంటరిగా దొరికిన ఆడవారిపై కర్కశంగా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఇందుకు సాక్ష్యం.. తాజాగా జరిగిన ప్రియాంక మర్డర్ కేస్..

 

మొదటి నుంచి ప్రియాంకను గమనిస్తూ.. పక్కా స్కెచ్ వేసి..ఆమెపై నలుగురు యువకులు పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి.. ఆపై గొంతు నులిమి చంపడమే కాకుండా.. శవాన్ని దుప్పటిలో చుట్టి తగలబెట్టారు. ఆ నాడు ఢిల్లీ నడిబొడ్డులో.. ఇప్పుడు హైదరాబాద్ శివారుల్లో.. రెండూ కూడా అమానుషమైన సంఘటనలు.. ఇలా జరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. 2012 నుంచి 2019 మధ్య కాలంలో చరిత్ర పుటలో పేజీలు మారాయి తప్పితే నేరాలకు అడ్డుకట్ట పడలేదు. చట్టాలను సక్రమంగా అమలు చేయలేని ప్రభుత్వాలు, సమయానికి స్పందించలేని పోలీసులు, యువకులను నేరప్రవుత్తి వైపు నడిపిస్తున్న సమాజపు పోకడలు అన్నీ కారణమే. ఫలితంగా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఆడవాళ్లపై దారుణ అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నారు. 

 

క్యాండిల్ ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు ఎన్నిజరిగితే మాత్రం ఏం ప్రయోజనం. భద్రత కావాలి మొర్రో అని మహిళలు నినదిస్తున్నా ఎన్నేళ్లయినా మార్పురాని దుస్థితి. ఈ నేరాలు ఎలాంటి విచక్షనా లేనివి. ఈ క్రూరత్వం నిర్వచనాలకు అందనిది. నైతికతను, మనిషితనాన్ని ఏ చట్టాలూ నియంత్రించలేవు. చట్టం నేరం చేశాక మాత్రమే భౌతిక శిక్ష విధిస్తుంది. కానీ, నేరాలు జరక్కుండా ఆగాలంటే, వ్యవస్థ మైండ్ సెట్ మారాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: