ప్రియాంక హత్యపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలు, నిరసనలతో తెలుగు రాష్ట్రాలు హోరెత్తాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు జనం. ఇటు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. 

 

యావత్ దేశం కదిలింది. డాక్టర్ ప్రియాంక హత్యను నిరసిస్తూ భారతావణి భగ్గుమంది. నిర్భయ తరహాలో...నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు జనం. చిన్నాపెద్దా తేడా లేదు. స్కూల్‌ పిల్లల నుంచి యూనివర్సిటీల వరకూ. తరగతులు బహిష్కరించి ఆందోళనలు చేపట్టారు . జస్టిస్‌ ఫర్‌ ప్రియాంక పేరుతో ర్యాలీలు నిర్వహించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు రోడ్డెక్కాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని మండిపడ్డాయి ప్రజాసంఘాలు. హైదరాబాద్‌లో మహిళాలోకం నిరసనన ప్రదర్శనలు చేపట్టింది. ప్రియాంక రెడ్డి హత్యను ఖండిస్తూ..ధర్నా చేపట్టారు. క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించారు. 

 

వరంగల్‌లో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ప్రియాంక రెడ్డి, మానసలను హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయలంటూ ర్యాలీ తీశారు. నిందితుల దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లోనూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో అట్టుడిగాయి. విద్యార్థులు, మహిళా సంఘాలు మండిపడ్డారు.

 

ఆందోళనలతో ఏపీ హోరెత్తింది. కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకూ... ప్రియాంక హత్యపై మండిపడ్డారు జనం. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో వెటర్నరీ యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటు తిరుపతిలోని పశువైద్య విద్యాలయం భవనం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. 

 

విశాఖలోనూ ఆందోళనలు జరిగాయి. ఎన్ని చట్టాలు చేసినా...మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టం తీసుకొచ్చినా.. భయం లేదన్నారు. బహిరంగంగా ఉరి తీస్తేనే ప్రియాంక ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఆమె కుటుంబానికి తాము అండగా ఉన్నామని తెలిపారు. లాయర్లు ఎవరూ నిందితుల తరఫున వాదించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు జనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: